ఒక్క గాలివాన- వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు
భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీ-తెలంగాణతో పాటు ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. వీటికి బలమైన ఈదురుగాలులు తోడయ్యాయి. అటు పశ్చిమబెంగాల్‌లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాల తీవ్రత మరో రెండు రోజుల పాటు ఉంటుందని భువనేశ్వర్‌లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రత్యేకించి- కోస్తా జిల్లాలు బాలేశ్వర్, భద్రక్, జగత్‌సింగ్‌పూర్, పూరీ, గంజాంలల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
భద్రక్, జాజ్‌పూర్ జిల్లాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. వడగండ్ల వర్షాలు పలు ప్రాంతాలను హడలెత్తించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల ధాటికి బాసుదేవ్‌పూర్, బైతరణి, దులఖపట్న, మంజూరి, జాజ్‌పూర్.. వంటి చోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది. బలమైన ఈదురుగాలులు వీచాయి.

దీని ప్రభావం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై పడింది. వడగండ్లు, గాలివాన దెబ్బకు పూరీ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు బయలుదేరి వెళ్లిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అద్దాలు పగిలిపోయాయి. లావుపాటి వడగండ్లు పడటంతో ఈ ఎక్స్‌ప్రెస్ రైలింజిన్ విండ్ స్క్రీన్ పగిలిపోయింది. మిగిలిన బోగీల దెబ్బతిన్నాయి. విండ్ స్క్రీన్ పగిలిపోవడం వల్ల వర్షపునీరు విసురుగా రైలింజిన్‌లోకి ప్రవేశించింది.
పైలెట్ క్యాబిన్ పాక్షికంగా ధ్వంసమైంది. విద్యుత్ సరఫరా కూడా స్తంభించిపోయింది. దులఖపట్న- మంజూరీ రోడ్ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలును దులఖపట్న స్టేషన్‌లో నిలిపివేశారు. బోగీల నుంచి ఇంజిన్‌ను విడదీసి- లోకో షెడ్‌కు పంపించారు. విండ్ స్క్రీన్, పైలెట్ క్యాబిన్ అద్దాలను సరిచేసిన తరువాతే మళ్లీ ఈ రైలును హౌరాకు పంపిస్తామని వెల్లడించారు.

రైలులో ఉన్న 250 మంది ప్రయాణికులను ఇతర మార్గాల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ఇవ్వాళ్టి హౌరా-పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను రద్దు చేశారు. పూరీ నుంచి రావాల్సిన రైలు మార్గమధ్యలోనే ఆగిపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం.. ఈ తెల్లవారు జామున హౌరా నుంచి పూరీకి బయలుదేరి వెళ్లాల్సిన నంబర్ 22896 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ఈ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఆయన పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు.












Click it and Unblock the Notifications