Video: రఫేల్ ల్యాండింగ్ సక్సెస్! తొలి టెస్టులోనే చరిత్ర సృష్టించిన ఫైటర్ జెట్
ఇండియన్ నేవీ హిస్టరీలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అరేబియా సముద్ర తరంగాల మధ్య, మన స్వదేశీ విమాన వాహక నౌక 'ఐఎన్‌ఎస్ విక్రాంత్' (INS Vikrant)పై ఫ్రాన్స్ నిర్మిత 'రఫేల్ మెరైన్' (Rafale Marine) యుద్ధ విమానం తొలిసారిగా విజయవంతంగా ల్యాండ్ అయింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా, అక్టోబర్ 29న జరిగిన ఈ ట్రయల్స్‌లో మొదటి ప్రయత్నంలోనే రఫేల్ జెట్ ఐఎన్‌ఎస్ విక్రమ్ డెక్ తాకడం భారత నావికా దళ సాంకేతిక సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. మన సముద్ర సరిహద్దుల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా ఈ విజయం ఒక మైలురాయిలా నిలవనుంది.
ఈ అద్భుత ఘట్టానికి ముందు, భారత నేవీ నిపుణులు గోవాలోని తీరప్రాంత శిక్షణ కేంద్రంలో రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలపై పలు కీలక పరీక్షలు నిర్వహించారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌక ప్రత్యేకతలకు, దానిపై నుంచి టేకాఫ్, ల్యాండింగ్ సౌకర్యాలకు అనుగుణంగా విమానంలో చేయాల్సిన మార్పులపై ఈ ట్రయల్స్ జరిగాయి. ఆ పరీక్షలన్నీ విజయవంతం కావడంతోనే నేరుగా నౌకపైకి రఫేల్ జెట్‌ను దింపే విన్యాసాన్ని చేపట్టారు. అనుకున్న సమయానికి, అనుకున్న కచ్చితత్వంతో రఫేల్ వచ్చి డెక్‌పై ల్యాండ్ అవ్వడంతో శాస్త్రవేత్తలు, సైనిక అధికారులు హర్షధ్వానాలు చేశారు.

రూ. 63 వేల కోట్ల మెగా డిఫెన్స్ డీల్!
భారత నావికా దళాన్ని అంతర్జాతీయ స్థాయిలో శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దేందుకు గాను భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌తో రూ. 63 వేల కోట్ల విలువైన భారీ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా మొత్తం 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ భారత్‌కు రానున్నాయి. వీటిలో 22 సింగిల్ సీటర్ జెట్‌లు కాగా, 4 ట్విన్ సీటర్ విమానాలున్నాయి. రఫేల్ నేవల్ వేరియంట్‌ను కొనుగోలు చేసిన మొదటి అంతర్జాతీయ దేశంగా భారత్ నిలిచింది. 2028 చివరి నాటికి లేదా 2029 ప్రారంభంలో ఇవి పూర్తిగా భారత నావికా దళంలో చేరనున్నాయి. కేవలం విమానాలే కాకుండా పైలట్ల శిక్షణ, ఫ్లైట్ సిమ్యులేటర్లు, అత్యాధునిక ఆయుధాలు, సుదీర్ఘకాల నిర్వహణ బాధ్యతలను కూడా ఈ డీల్ కవర్ చేస్తుంది.
A Rafale Marine aircraft successfully landed onboard #IndianNavy's indigenous Aircraft Carrier #INSVikrant on its maiden attempt on 29 Oct 26.The ongoing trials mark the first steps towards operationalisation of the aircraft in the #IndianNavy. https://t.co/gIZ0h3nl80
— SpokespersonNavy (@indiannavy) October 30, 2026
'ఆత్మనిర్భర్' ఆయుధాల కలయిక!
ఫ్రాన్స్ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ నిర్మించిన ఈ రఫేల్ మెరైన్ జెట్లు ఇప్పటికే ఫ్రెంచ్ నేవీలో సేవాలందిస్తున్నాయి. భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆత్మనిర్భర్ భారత్' పిలుపులో భాగంగా, ఈ విమానాల్లో మన స్వదేశీ ఆయుధ వ్యవస్థలను లింక్ చేసే సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి (Transfer of Technology) కూడా ఒప్పందం కుదిరింది. దీనివల్ల భారత వైమానిక దళంలో ఇప్పటికే సేవలు అందిస్తున్న రఫేల్ జెట్లకు, అలాగే రాబోయే నేవల్ జెట్లకు మన దేశీయ క్షిపణులను సులభంగా అమర్చుకునే వెసులుబాటు కలుగుతుంది.
సముద్రాలపై తిరుగులేని ఆధిపత్యం!
ప్రస్తుతం భారత నేవీ వద్ద ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య అనే రెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి. కొత్తగా వస్తున్న 26 రఫేల్-ఎం జెట్‌లను ఈ రెండు నౌకల నుంచి ఆపరేట్ చేసే సదుపాయం ఉంటుంది. సముద్రంలో వైమానిక భద్రత, శత్రు నౌకలపై మెరుపు దాడులు, రికనైసెన్స్ (గూఢచర్యం) తీరప్రాంత లక్ష్యాలను ఛేదించడంలో రఫేల్ మెరైన్ అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తుంది. శత్రువుల ఆయుధ శ్రేణికి దొరక్కుండా, సముద్రాలపై భారత సైనిక ఆధిపత్యాన్ని నిలబెట్టడంలో ఈ సూపర్ సోనిక్ ఫైటర్ జెట్లు కొండంత అండగా మారనున్నాయి.














Click it and Unblock the Notifications
