పహల్గామ్‌పై కాంగ్రెస్ కొత్త డిమాండ్?
Pahalgam Terror attack: ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్‌కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.
ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేయడమే కాకుండా దేశంలో నివస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.

ఈ పరిణామాలు భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. యుద్ధ వాతావరణానికి దారి తీసింది. రెండు దేశాలు కూడా యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టాయి కూడా. భారత్, పాకిస్తాన్ రెండూ తమ నౌకాదళ విన్యాసాలను నిర్వహించాయి. అరేబియా సముద్రంపై మిస్సైల్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాయి. యుద్ధ వాహక నౌకల సామర్థ్యాన్నీ పరీక్షించుకున్నాయి.
ఈ పరిస్థితుల మధ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కొత్త డిమాండ్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. ప్రత్యేకంగా పార్లమెంట్ ఉభయసభలను సమావేశపర్చాలనే వాదాన్ని వినిపించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వేర్వేరుగా లేఖలు రాశారు.
పహల్గామ్‌లో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడిని అతి క్రూరమైనదిగా అభివర్ణించారు. ఈ దాడి ఫలితంగా తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడానికి సమష్టి నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని, సంఘీవాన్ని తెలియజేయడానికి పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపర్చాలని విజ్ఞప్తి చేశారు.
పహల్గామ్ దాడి తరువాత ఉగ్రవాదం, ఉగ్రవాద దాడులు, సరిహద్దుల్లో ముమ్మరమైన చొరబాట్లు, దేశ భద్రత, ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో ఏర్పడిన పరిస్థితులు.. ఇతరత్రా అంశాలు లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ.. ఉత్తర ప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీకి వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన లక్నో విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ నాయకులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications