ప్రతిపక్షాలు టాప్ గేర్- నల్లదుస్తులతో పార్లమెంట్ కు: కేంద్రంపై.. !!
దేశంలో విద్యా రంగాన్ని కుదిపేస్తున్న పేపర్ లీకేజీలు, ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేస్తోన్న విద్యార్థులపై లాఠీఛార్జీ ఘటనలపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇండియా కూటమికి చెందిన పలువురు లోక్ సభ, రాజ్యసభ సభ్యులు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ ఆవరణలో భారీ ప్రదర్శన చేపట్టారు.
విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోందంటూ నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. వరుసగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పరీక్షల అవకతవకలు, పేపర్ లీకేజీల వంటి ఉదంతాలు.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. ధర్మేంద్ర ప్రధాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటంలో విఫలమైన ఆయనకు ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని తేల్చి చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి లోకం మొత్తం గళం విప్పిందని, దీన్ని గౌరవించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అన్నారు. ఇంన్ని లక్షలమంది డిమాండ్ చేస్తోన్న గానీ రాజీనామా చేయకపోవడం సరికాదని అన్నారు.
ఎంపీలు పవన్ ఖేరా, ఎంపీ మల్లు రవి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఢిల్లీలో విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి అత్యంత విచారకరమని అన్నారు. విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరును ఖండిస్తోన్నామని, దీనికి నిదర్శనంగానే విపక్ష సభ్యులందరూ కూడా నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్‌కు వచ్చినట్లు వెల్లడించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ గళాన్ని బలంగా వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
नरेंद्र मोदी कायर है pic.twitter.com/ph1JknTSjG
— Congress (@INCIndia) July 22, 2026
విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ప్రియాంక గాంధీ వాద్రా తప్పుపట్టారు. విద్యా వ్యవస్థ మొత్తాన్నీ కూడా కేంద్రం క్రమంగా నిర్వీర్యం చేస్తోందని, రూ. 1.4 లక్షల కోట్లను మాత్రమే బడ్జెట్‌లో కేటాయించిందని గుర్తు చేశారు. అదే సమయంలో కార్పొరేట్ శక్తులు అదానీ, అంబానీలకు ఏకంగా రూ. 16 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేసిందని ఆమె ఆరోపించారు. యువత తమ న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా చేస్తున్న పోరాటంలో తప్పులేదని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
విద్యార్థుల ప్రయోజనాల కోసం తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రతిపక్షాల ఎంపీలు తేల్చి చెప్పారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడం, కేంద్రం తన ధోరణిని మార్చుకునేంత వరకూ సభ లోపల, బయటా తమ ఆందోళనలను మరింత ముమ్మరం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications