ఏం చెప్పినా.. అప్పటి దాకా నో కాంప్రమైజ్- ప్రధానికి తేల్చేసిన CJP, రాహుల్..!!
ప్రధాని హామీ ఇచ్చినా నిరసనలు తగ్గేలా లేవు. పేపర్ లీక్ బాధ్యులను శిక్షిస్తామని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. యువత భవిష్యత్.. సంక్షేమం తమకు ముఖ్య మని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రకటన పైన సీజేపీ, రాహుల్ స్పందించారు. ప్రధాని ఎన్ని చెప్పినా... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తాము వెనక్కు తగ్గబోమని తేల్చి చెప్పారు. దీంతో.. ఇప్పుడు ప్రధాని ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ప్రధాని తాజా ప్రకటన పైన కాక్రోచ్ జనతా పార్టీ.. రాహుల్ గాంధీ స్పందించారు. ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్న నిరసనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోనూ విస్తరిస్తున్నాయి. కాక్రోచ్ పార్టీల నేతలతో చర్చలకు సిద్దమని కేంద్రం ప్రతిపాదించింది. అయితే, తటస్థ వేదికల్లో నే చర్చలు చేస్తామని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేసారు. అటు పార్లమెంట్ సమావేశాలు ముందుకు సాగటం లేదు. కాగా.. ఈ సమయంలో ప్రధాని మోదీ స్పందించారు. పరీక్షల అక్రమాలకు పాల్పడి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారికి త్వరితగతిన, అత్యంత కఠినమైన శిక్షలు పడేలా చూడటానికి 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులను' ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ అంశంపై ఇవాళ సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే...
'మన యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే.. ఏదీ ముఖ్యం కాదు! పేపర్ లీకేజీల్లో ప్రమేయం ఉన్నవారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన పైన కాక్రోచ్ జనతా పార్టీ.. రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేస్తూనే.. తమ డిమాండ్లు స్పష్టం చేసారు. రాహుల్ తన ట్వీట్ లో.." మన యువత భవిష్యత్తును అత్యంత దారుణంగా దెబ్బతీసింది మీరే. మన విద్యా వ్యవస్థ పూర్తిగా హస్తగతం కావడం మరియు నాశనం కావడాన్ని మీరు అనుమతించారు, అలాగే ప్రోత్సహించారు - అంతేకాక, దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ మీరు కాపాడారు. విద్యార్థుల డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి: 1. ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలి.2. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. 3. వారిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..." అని తేల్చి చెప్పారు. దీంతో... ఇప్పుడు ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications