ప్రజాస్వామ్యం ఉంటే పార్లమెంటులో మాట్లాడనివ్వండి-బీజేపీ నిరసనలపై రాహుల్ గాంధీ కౌంటర్
భారత్ లో ప్రజాస్వామ్యం లేదంటూ బ్రిటన్ లో తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నిరసనలకు దిగడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.
భారత్ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చోటు చేసుకుంటున్న పరిణామాలపై తాజాగా భారత్ జోడో యాత్ర చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. అనంతరం బ్రిటన్ వెళ్లి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ప్రజాస్వామ్యం లేదని, పార్లమెంటులో సైతం మాట్లాడే పరిస్ధితి లేదన్నారు. దీనిపై గత కొన్ని రోజులుగా పార్లమెంటులో నిరసనలు చేస్తున్న బీజేపీ.. ఇవాళ ఆయన పార్లమెంటులో వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. దీనిపై రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు.
భారత్ లో ప్రజాస్వామ్యం లేదని తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలకు దిగుతున్న బీజేపీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం ఉన్నట్లయితే తనను పార్లమెంటులో మాట్లాడేందుకు అనుమతించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ విదేశాల్లో దేశాన్ని అవమానించారన్న బీజేపీ ఆరోపణపై పార్లమెంట్‌లో మాట్లాడేందుకు ఇప్పటికైనా తనను అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. కానీ వారు నన్ను మాట్లాడనివ్వరని తాను అనుకోనన్నారు.

రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన నేపథ్యంలో.. కేంద్రమంత్రులు కూడా ఆయన క్షమాపణకు డిమాండ్ చేస్తుండటంతో రాహుల్ గాంధీ లోక్‌సభకు హాజరయ్యారు. ఈరోజు తాను సభకు వచ్చిన ఒక్క నిమిషంలోనే సభను వాయిదా వేశారని, తన భావాన్ని సభా వేదికపై పెట్టాలనే ఆలోచనతో పార్లమెంటుకు వెళ్లానని రాహుల్ తెలిపారు. భారత ప్రజాస్వామ్యం పనిచేస్తుంటే పార్లమెంట్‌లో తన అభిప్రాయం చెప్పగలనని, మీరు చూస్తున్నది భారత ప్రజాస్వామ్యానికి పరీక్షేనని కాంగ్రెస్ యువనేత వ్యాఖ్యానించారు. తనపై విమర్శలు చేసేందుకు ఆ నలుగురు కేంద్రమంత్రులకు ఇచ్చినట్లే ఒక ఎంపీకి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వబోతున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications