సీటింగ్ వివాదమే కారణమా? ఎర్రకోట వేడుకలకు రాహుల్ గాంధీ డుమ్మా
Independence Day Celebrations: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు గైర్హాజరు కావడంతో పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకలలో వివిధ కార్యక్రమాలు ఉంటాయి. దేశ ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అధికార పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్ష పార్టీల ప్రముఖ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ సంవత్సరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వీరిద్దరూ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపినిస్తున్నాయి. బీజేపీ వారిని తీవ్రంగా విమర్శిస్తూ వారి చర్యను సిగ్గుమాలినదిగా పేర్కొంది.
గత సంవత్సరం సీటింగ్ వివాదం కారణంగా రాహుల్ అలిగినట్లు సమాచారం
ఈ విషయంపై కాంగ్రెస్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే గత సంవత్సరం జరిగిన వేడుకలలో సీటింగ్ ఏర్పాటుపై రాహుల్ అసంతృప్తిగా ఉన్నారని అందుకే ఈ సారి కార్యక్రమంలో పాల్గొనలేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ ఇద్దరు నాయకులు ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో మాత్రం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వర్షం పడుతున్నప్పటికీ జెండా ఎగురవేయబడింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వర్షంలో తడుస్తూనే జాతీయ గీతం ఆలపించారు.

బీజేపీ తీవ్ర విమర్శలు.. 'సిగ్గుమాలిన చర్య'
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎర్రకోట కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీ గైర్హాజరీపై వ్యంగ్యంగా స్పందించిన షెహజాద్ పూనావాలా ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. "కాంగ్రెస్ ప్రతినిధి నాతో టీవీ డిబేట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగస్టు 15 కార్యక్రమానికి రాలేదని ధ్రువీకరించారు. ఇది ఒక జాతీయ పండుగ, కానీ దురుదృష్టవశాత్తు పాకిస్థాన్ ప్రేమికుడు రాహుల్ గాంధీ- మోడీ వ్యతిరేకతలో దేశం, సైన్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఇది సిగ్గుమాలిన చర్య. ఇదేనా రాజ్యాంగాన్ని, సైన్యాన్ని గౌరవించడం?" అని రాసుకొచ్చారు.
గత సంవత్సరం సీటింగ్ వివాదం ఏమిటి?
గత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో సీటింగ్ ఏర్పాటుపై ఒక వివాదం చెలరేగింది. ప్రోటోకాల్‌కు విరుద్ధంగా రాహుల్‌ను ఐదో వరుసలో కూర్చోబెట్టారు. ప్రోటోకాల్ ప్రకారం.. ప్రతిపక్ష నాయకుడిని మొదటి వరుసలో కూర్చోబెట్టాలి. కానీ గత సంవత్సరం మొదటి వరుసలో అప్పటి సీజేఐ డీవై చంద్రచూడ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, అమిత్ షా, ఎస్.జైశంకర్ వంటి వారు కూర్చున్నారు. ఆ తర్వాత ఒలింపిక్ పతక విజేతలను కూర్చోబెట్టారు. వారి తర్వాత చివరి వరుసకు ముందు రాహుల్ గాంధీని కూర్చోబెట్టారు. ఈ సీటింగ్ ఏర్పాటుపై ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేతను అవమానించారని పేర్కొంది. అయితే కార్యక్రమాన్ని నిర్వహించిన రక్షణ మంత్రిత్వ శాఖ ఒలింపియన్లకు చోటు కల్పించడానికి ఈ మార్పులు చేశామని వివరణ ఇచ్చింది.
సోశల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపిన రాహుల్, ఖర్గే
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎర్రకోట కార్యక్రమంలో కనిపించనప్పటికీ.. ఈ ఇద్దరు నేతలు సోషల్ మీడియా ద్వారా స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పిస్తూ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ తన పోస్టులో "అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలతో లభించిన ఈ స్వాతంత్ర్యం, నిజం, సమానత్వం ఆధారంగా న్యాయం ఉండే ఒక భారతదేశాన్ని నిర్మించడానికి ఒక సంకల్పం. ప్రతి హృదయంలో గౌరవం, సోదరభావం ఉండాలి. ఈ అమూల్యమైన వారసత్వం, గౌరవాన్ని, మర్యాదను కాపాడటం మనందరి కర్తవ్యం. జై హింద్, జై భారత్," అని రాశారు. మల్లికార్జున ఖర్గే తన పోస్ట్‌లో, "స్వాతంత్ర్య దినోత్సవం అనేది మన ప్రజాస్వామ్యం ప్రోత్సహించే స్వాతంత్ర్యం, న్యాయం, సమానత్వం, సోదరభావం అనే విలువలకు మనల్ని మనం తిరిగి అంకితం చేసుకోవడానికి ఒక పవిత్రమైన సందర్భం." అని రాశారు.
सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं।
— Rahul Gandhi (@RahulGandhi) August 15, 2025
महान स्वतंत्रता सेनानियों के बलिदान से मिली यह आज़ादी, एक ऐसे भारत के निर्माण का संकल्प है - जहां सत्य और समानता की नींव पर न्याय हो, और हर दिल में सम्मान और भाईचारा हो।
इस अनमोल धरोहर के गौरव और सम्मान की रक्षा करना हम… pic.twitter.com/VtxOjU66cl












Click it and Unblock the Notifications