ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా! రాహుల్ అండగా నిలిచారు: రమ్య దివ్య స్పందన
బెంగళూరు: తన తండ్రి చనిపోయాక తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని సినీ నటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్య దివ్య స్పందన వెల్లడించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తనకు మానసిక ధైర్యాన్ని ఇచ్చారని, తనకు అండగా ఉన్నారని తెలిపారు. ఇటీవల ఓ కన్నడ టాక్‌షోలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
'నా తండ్రి చనిపోయిన రెండు వారాలకే నేను పార్లమెంటుకు వెళ్లాను. అక్కడ నాకు ఎవరూ తెలీదు. ఏమీ తెలీదు. పార్లమెంట్ కార్యకలాపాలు గురించి అస్సలు ఐడియా లేదు. చిన్నచిన్నగా అన్ని విషయాలు తెలుసుకోవడం ప్రారంభించాను. పనిలో పడి నా బాధను తగ్గించుకునే ప్రయత్నం చేశాను. మాండ్య ప్రజలు నాపై నమ్మకాన్ని ఉంచారు' అని రమ్య దివ్య స్పందన తెలిపారు.

తన తండ్రి దూరమైన సమయంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని చెప్పారు. అప్పుడు రాహుల్ గాంధీ తనకు మానసికంగా అండగా నిలిచారని తెలిపారు. అమ్మ ప్రభావం తనపై ఎంతగానో ఉంటుందని, తర్వాత తన తండ్రి, మూడో స్థానంలో రాహుల్ గాంధీ ఉంటారని దివ్య స్పందన వెల్లడించారు.
రమ్య దివ్య స్పందన 2012లో యువజన కాంగ్రెస్‌లో చేరారు. ఆమె 2013 ఉప ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్‌గా పనిచేసిన రమ్య.. ఆ తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. గత సంవత్సరం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన దివ్య స్పందన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించారు. ఇటీవల రాహుల్ భారత్ జోడో యాత్రలో కూడా రమ్య భాగస్వాములయ్యారు.












Click it and Unblock the Notifications