పిఎం అభ్యర్థిగా సోనియా నో: రాహుల్ ప్రచార సారథే

న్యూఢిల్లీ: ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారానికి తెర పడింది. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నిరాకరించారు. అలా ప్రకటించడం సంప్రదాయం కాదని ఆమె స్పష్టం చేశారు. అయితే, రాహుల్‌ను 2014 ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా నియమించారు. దీనికి గురువారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) విస్తృతస్థాయి సమావేశం వేదికగా మారింది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా రంగంలో దింపాలని, దీని వల్ల మొత్తం యువతను ఆకర్షించినట్లవుతుందని పలువురు నేతలు తొలుత డిమాండ్ చేశారు. అయితే, అందుకు సోనియా అంగీకరించలేదు.
కేరళ పిసిసి అధ్యక్షుడు రమేశ్ చెన్నితాల రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా మొదట ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను దిగ్విజయ్ సింగ్, బీకే హరిప్రసాద్, అజిత్ జోగీ, గురుదాస్ కామత్, గులాంనబీ ఆజాద్ తదితరులు బలపరిచారు. అందరి వాదనలు విన్న తర్వాత సోనియా గాంధీ వారి అభ్యర్థనలను తోసిపుచ్చారు. ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం మన పార్టీలో లేదని, ప్రధాని ఎవరో పార్లమెంట్ సభ్యులు నిర్ణయిస్తారని ఆమె చెప్పారు.
ఒకపార్టీ (బిజెపి) తమ ప్రధాని అభ్యర్థిని ప్రకటించినంత మాత్రాన మనం కూడా అలాగే చేయాల్సిన అవసరంలేదని సోనియా స్పష్టం చేశారు. అది జరిగిన మరుక్షణమే - రాహుల్ భావి నాయకుడని, వచ్చే ఎన్నికలు రాహుల్ సారథ్యంలో జరుగుతాయని సోనియా ప్రకటించారు. దాంతో హర్షధ్వానాలు చెలరేగాయి. ఆ తర్వాత రాహుల్‌ను ప్రచార కమిటీ సారథిగా ప్రతిపాదించడం, సిడబ్ల్యుసి సభ్యులు కరతాళ ధ్వనులతో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిపోయింది.
ప్రచార కమిటీ సారథి అంటే దాదాపు ప్రధానమంత్రి అభ్యర్థేనని, పార్టీ విజయం సాధిస్తే ఆయనే ప్రధాని అవుతారని పార్టీ సంకేతాలు పంపిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేదీ కూడా అంగీకరించారు. "ఆయన సారథ్యంలో ఎన్నికల ప్రచారం జరిగి విజయం సాధిస్తే భావి నాయకత్వం కూడా ఆయన చేతిలో ఉన్నట్లే'' అని తెలిపారు.
సిడబ్ల్యుసి సమావేశంలో చివరగా రాహుల్ గాంధీ రెండు నిమిషాలు మాట్లాడారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా నిర్వర్తిస్తానని, తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పారు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఇతర విజయాలను ప్రస్తావించారు. ప్రధాని అభ్యర్థితోపాటు శుక్రవారం జరిగే ఏఐసీసీ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మానాలపై సుదీర్ఘంగా చర్చించారు.












Click it and Unblock the Notifications