వారికి రైల్వే శుభవార్త.. స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు
రైల్వే ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి కష్టపడుతున్న యువతకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. స్టేషన్ మాస్టర్ పోస్టులకు సంబంధించి రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 18 ఏళ్లుగా ఉన్న కనీస వయోపరిమితిని 20 ఏళ్లకు పెంచింది. ఈ మార్పు అక్టోబర్ 7 నుంచి అమలులోకి వచ్చింది.
స్టేషన్ మాస్టర్ పోస్టు భారతీయ రైల్వేలో చాలా కీలకమైన పోస్ట్. రైలు నిర్వహణ, సిగ్నల్స్, ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి కీలక బాధ్యతలు ఈ పోస్టు వారిపైనే ఉంటాయి. అందుకే ఈ ఉద్యోగానికి సరైన అర్హత, మెచ్యూరిటీ అవసరం అని రైల్వే బోర్డు భావించింది. గతంలో ఇండియన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ మాన్యువల్ ప్రకారం 18 నుంచి 30 ఏళ్ల వరకు వయోపరిమితి ఉండేది. ఇప్పుడు కనీస వయసును 20 ఏళ్లకు పెంచుతూ నిబంధనలను సవరించారు.

ఈ నిర్ణయం గురించి రైల్వే బోర్డు అధికారిక లేఖ జారీ చేసి అన్ని జోనల్ రైల్వేలు, ఉత్పత్తి యూనిట్లు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ఛైర్పర్సన్లకు పంపింది. లేఖ జారీ చేసిన తేదీ నుంచే కొత్త నిబంధన అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే కేంద్ర స్థాయి ఉద్యోగ ప్రకటన విడుదలై నియామక ప్రక్రియ కొనసాగుతున్న కేసులకు మాత్రం పాత నిబంధనలే వర్తిస్తాయని స్పష్టం చేశారు.
అంటే ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చినవాటిలో 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త నోటిఫికేషన్లలో మాత్రం 20 ఏళ్లు నిండి ఉండాలి. ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. సంఘం ప్రధాన కార్యదర్శి శరద్ చంద్ర పురోహిత్ మాట్లాడుతూ, ఇది చాలా కాలంగా తాము కోరుతున్న డిమాండ్ అని చెప్పారు.
ఈ మార్పు అభ్యర్థులకు కొంత ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా 18-19 ఏళ్ల వయసు ఉన్నవారు ఇకపై కొత్త నోటిఫికేషన్లలో దరఖాస్తు చేసుకోలేరు. అయితే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మరింత మెచ్యూరిటీతో ఈ బాధ్యతాయుత పోస్టుకు రావడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













Click it and Unblock the Notifications
