'నాన్నా.. నీకు ఈ డ్రెస్ బాగుంటుంది'.. అంటూనే క్షణాల్లో కుప్పకూలిన యువకుడు.. ఏమైందంటే..?
ఇటీవలికాలంలో చాలామంది యువకులు చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. డీజే పాటలకు.. జిమ్ లో వర్క్ అవుట్స్ చేసుకుంటూ.. క్రికెట్ లాంటి ఆటలు ఆడుకుంటూ క్షణాల్లోనే కుప్పకూలుతున్నారు. మారుతున్న జీవన శైలి, వాతావరణ పరిస్థితులు, కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత అలవాట్లు ఇప్పుడు చాలా మంది యువతకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ పరిణామాలతో యువత గుండె పోటుకు గురవుతున్నారు. మరి కొందరు యువకులు పొగాకు ఉత్పత్తులకు, సిగరెట్ లాంటి అలవాట్లకు పాల్పడుతున్నారు. దీనివల్ల చిన్న వయసులోనే గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో చేతికందివచ్చిన తమ కుమారులు చిన్న వయసులోనే అకాల మరణం పొందుతున్న నేపథ్యంలో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది.
తాజాగా ఖమ్మం జిల్లాలోనూ ఇలాంటి విషాదకరమైన ఘటనే జరిగింది. దసరా సెలవులను హాయిగా గడిపేందుకు ఇంటికి వచ్చిన కుమారుడు తల్లిదండ్రుల కళ్లెదుటే కుప్పకూలి మృతిచెందాడు. దాంతో ఆ కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కళ్లముందే కుప్పకూలిపోవడంతో వాళ్ల రోదనలు మిన్నంటాయి. ఖమ్మం జిల్లాలోని వైరా మున్సిపాలిటీ పరిధిలోని గండగలపాడులో తాజాగా ఈ విషాద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ గ్రామానికి చెందిన కిన్నెర కృష్ణ-విజయ దంపతులకు కుమారుడు రాఘవ(19) ఉన్నాడు. రాఘవ హైదరాబాద్ లోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

అయితే దసరా సెలవులు కావడంతో ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు రెండు రోజులక్రితం ఇంటికి వచ్చాడు రాఘవ. అయితే శుక్రవారం తెల్లవారుజామున రాఘవ ఇంటిముందుకు ఓ వ్యక్తి బైక్ పై బట్టలు విక్రయించాడు. ఆ సమయంలో రాఘవ తల్లి విజయ ఆ బట్టలను పరిశీలిస్తోంది. అదే సమయానికి నిద్రలేచి బయటకు వచ్చిన రాఘవ.. తన తండ్రితో మాట్లాడుతూ 'నాన్నా.. నీకు ఈ చొక్కాలు బాగుంటాయి' అని చెప్పి మంచంపై కూర్చొన్నాడు. అలా మంచం మీద కూర్చోగానే క్షణాల వ్యవధిలోనే అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఫలితం లేకుండా పోయింది. రాఘవ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. చేతికొచ్చిన కొడుకు ఇలా క్షణాల్లోనే మృతి చెందడంపై ఆ తల్లిదండ్రులు లబోదిబోమని ఏడుస్తున్నారు. ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని.. ఎప్పుడైనా గుండెలో ఇబ్బందులు అనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications
