రైల్వే టీటీఈలకు బాడీ కెమెరాలు
మరో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు భారతీయ రైల్వే (Indian Railways) సిద్ధమైంది. టికెట్ తనిఖీల్లో పారదర్శకత, రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను అరికట్టేందుకు గానూ టికెట్ తనిఖీ అధికారులకు (TTE) ఇకనుంచి బాడీ కెమెరాలు అమర్చబోతోంది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబయి డివిజన్‌లో 50 బాడీ కెమెరాలను (Body Cameras) టీటీఈలకు అందజేయబోతున్నారు. ఇక్కడ విజయవంతమైతే దేశమంతటా విస్తరించే అవకాశం ఉంది.

2005లో యూకే పోలీసులు బాడీ కెమెరాల వినియోగాన్నిప్రారంభించారు. ఆ తర్వాత భారత్ తోపాటు పలు దేశాల్లోని శాంతి భద్రత విభాగాల్లో పనిచేసేవారు వీటిని ఉపయోగించడం ప్రారంభించారు. తాజాగా రైల్వేలోను వినియోగించబోతున్నారు. ఒక్కోటి రూ.9వేల విలువచేసే 50 కెమెరాలను కొనుగోలు చేశారు. దాదాపు 20 గంటల ఫుటేజ్ ను రికార్డు చేస్తాయి. ముంబయి జోన్ లో విజయవంతమైతే దేశంలోని అన్ని జోన్లకు ఈ విధానాన్ని తీసుకురాబోతున్నారు.

బాడీ కెమెరాలను టీటీఈలకు అమర్చడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవల సెంట్రల్ రైల్వే పరిధిలో ఓ మహిళా పాసింజర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఓ టీటీఈని రైల్వే సస్పెండ్ చేసింది. కొన్నిసార్లు రైల్వే ప్రయాణికులు సైతం వీరంగం చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బాడీ కెమెరాల ద్వారా ఈ తరహా సంఘటనలు జరగడానికి అవకాశాలు తక్కువని అధికారులు అంటున్నారు. టికెట్ల తనిఖీలో పాదర్శకత తీసుకురావడంతో పాటు తనిఖీ అధికారుల్లో వృత్తినైపుణ్యం, జవాబుదారీతనం మెరుగవుతాయని చెబుతున్నారు. రైళ్లలో జరిమానా విధించిన సందర్భాల్లో యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే విధానాన్నీ సెంట్రల్ రైల్వే ఇటీవలే ప్రారంభించింది












Click it and Unblock the Notifications