ప్రయాణికులకు రైల్వే హెచ్చరిక: రైలు కదిలే సమయంలో ఈ పనులు నేరం; జైలుశిక్షకు ఛాన్స్!!
భారతీయ రైల్వేలు ఎన్నో నియమ నిబంధనలు విధించినప్పటికీ రైల్వే ప్రయాణికులు మాత్రం వాటిని ఏమాత్రం పాటించడం లేదు. అయితే భారతీయ రైల్వే నియమ నిబంధనలను పాటించని క్రమంలో అవి నేరాలుగా పరిగణించబడతాయి అని, జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని రైల్వే అనేకమార్లు తమ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక తాజాగా మరోమారు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసి, ఆ తప్పులు చేయవద్దని సూచించింది.
చాలామంది రైలు కదులుతున్న సమయంలో ఎక్కటం, దిగడం చేస్తూ ఉంటారు. అంతేకాదు రైల్వే ప్లాట్ ఫామ్ లలో ఒక ప్లాట్ ఫాం నుండి ఒక ప్లాట్ఫామ్ కు మారడానికి పట్టాల మీదనుండే దాటి వెళుతుంటారు. ఇక ఇటువంటి సమయాలలో అనేకమార్లు ఘోర ప్రమాదాలు చోటుచేసుకుని ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు కాళ్లు, చేతులు కోల్పోయి వైకల్యం బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలని దక్షిణమధ్య రైల్వే హెచ్చరిస్తుంది.

రైలు కదులుతున్న సమయంలో ఎక్కటం, దిగడం చట్ట రీత్యా నేరమని, ప్రాణ హాని జరిగే ప్రమాదం ఉందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. భద్రత విషయంలో రైల్వే శాఖకు సహకరించాలని ఒక ప్రకటన విడుదల చేసిన దక్షిణ మధ్య రైల్వే పలు సూచనలు చేసింది. పొరపాటున కూడా రైళ్లు కదులుతున్న సమయంలో ఎక్కవద్దు.. దిగవద్దు అని ప్రయాణికులకు సూచించింది.
నిషేధిత ప్రాంతం నుంచి రైల్లోకి ప్రవేశించవద్దని పేర్కొంది. అంతేకాదు రైల్వే ట్రాక్ ల దగ్గర నడిచే సమయంలో, రైళ్లను ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని పేర్కొంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, సబ్ వేలు, రోడ్డు ఓవర్ బ్రిడ్జి లను ఉపయోగించాలని సూచించింది. రైల్వే ట్రాక్ ల దగ్గర వీడియోలు తీసుకోవడం, సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం, లేదా ఫోటో కెమెరాతో ఫోటోలు తీసుకోవడం నిషేధం అని పేర్కొంది.
ఇక ఎవరైనా సరే రైల్వే ట్రాక్ లను దాటడం చట్టరీత్యా నేరమని భారతీయ రైల్వే చట్టం 1989 సెక్షన్ 147 ప్రకారం ఆరునెలల వరకు జైలు శిక్ష లేదా వెయ్యి వరకు జరిమానా, లేదా రెండు శిక్షలను విధించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications