రాజస్తాన్ లో గత ఫలితాలు చెబుతున్నదేంటి ? నచ్చి ఓటేసిన వారికి ఐదేళ్లలోనే షాకులు !
ఈ నెలలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న ఐదు రాష్ట్రాల్లో రాజస్తాన్ కూడా ఒకటి. ఉత్తరాదిన హిందీ రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన రాజస్తాన్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి అధికారం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్, ఎలాగైనా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒపీనియన్ పోల్స్ సైతం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. కొన్ని సర్వేలు కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకుంటుందని చెబుతుండగా.. మరికొన్ని బీజేపీకి ఎడ్జ్ ఇస్తున్నాయి.
200 సీట్లున్న రాజస్తాన్ అసెంబ్లీకి ఈ నెల 25న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మరోసారి నెగ్గితే మాత్రం 1993 తర్వాత ఈ రికార్డు సాధించిన పార్టీగా చరిత్రకెక్కడం ఖాయం. 1993లో చివరి సారిగా బీజేపీ ఇలా రెండోసారి నెగ్గింది. అంతకు ముందు 1990లో గెలిచిన బీజేపీ 1993లో మళ్లీ గెలిచింది. ఆ తర్వాత మాత్రం ఇప్పటివరకూ ఐదేళ్లు అదికారం అనుభవించిన పార్టీకి అక్కడి ఓటర్లు ఓటేయడం మానేస్తున్నారు.

ఈ లెక్కన 1998 నుంచి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకూ చూసుకుంటే ఈ మధ్య జరిగిన ఐదు ఎన్నికల్లోనూ ఓటర్లు తమ సంప్రదాయ వైఖరి నుంచి బయటపడలేదు. 1998లో కాంగ్రెస్ కు ఏకంగా 153 సీట్ల మెజారిటీతో అధికారమిచ్చిన రాజస్తాన్ ఓటర్లు తిరిగి 2003కు వచ్చే సరికి బీజేపీకి 120 సీట్లతో అధికారం అందించారు. మళ్లీ 2008లో కాంగ్రెస్ కు 96 సీట్లతో అధికారం అందించారు. కానీ తిరిగి ఐదేళ్లలోనే బీజేపీకి ఏకంగా 163 సీట్లు ఇచ్చి అధికారంలోకి తెచ్చారు. మరో ఐదేళ్లు ముగిసే సరికి మళ్లీ కాంగ్రెస్ కు 100 సీట్లతో అధికారం అందించారు.
దీంతో గత ఐదు ఎన్నికల్లోనూ ఏ ఒక్క సారి కూడా కాంగ్రెస్, బీజేపీ ఇద్దరికీ రాజస్తాన్ ఓటర్లు రెండోసారి అధికారం ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఎంత రాజకీయ చైతన్యం ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో రాజస్తాన్ లో ఈసారి అధికారం మారుతుందా లేదా అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఎలాగైనా అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఇస్తున్న సంక్షేమ హామీలు ఆ పార్టీకి ఆధిక్యాన్ని ఇస్తున్నాయి. అటు బీజేపీ మాత్రం సంప్రదాయ ఓట్లు, హిందూత్వ రాజకీయాలకే కట్టుబడుతోంది.












Click it and Unblock the Notifications