నూతన సీఈసీగా రాజీవ్ కుమార్ - రాష్ట్రపతి నియామకం : 15న బాధ్యతల స్వీకరణ..!!
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి అధికారికంగా ఆమోద ముద్ర వేసారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తారు. అందులో భాగంగా ప్రస్తుత సీఈసీగా ఉన్న సుశీల్ చంద్ర పదవీ కాలం ముగుస్తుండటంతో నూతన సీఈసీ నియామకం పైన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న కమిషనర్లలో సీనియర్ అయిన రాజీవ్ కుమార్ సీఈసీగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల 14తో ముగియనుంది. సుశీల్ చంద్ర స్థానంలో రాజీవ్ కుమార్ మే 15న పదవీ బాధ్యతలు చేపడతారు. ఏడాది వరకు ఈ పదవిలో కొనసాగుతారు. 1984 బ్యాచ్ ఝార్ఖండ్ క్యాడర్‌కు చెందిన రాజీవ్.. గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగానూ పనిచేశారు. ప్రస్తుత సీఈసీ ఈ ఏడాదిలో జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించారు. రాజ్యాంగంలోని క్లాజ్ (2), ఆర్టికల్ 324 మేరకు రాజీవ్ కుమార్ ను నూతన సీఈసీగా నియమిస్తున్నట్లుగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజీజు ప్రకటించారు. 2020, సెప్టెంబర్ 20న రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.

ఆయన గతంలో పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు ఛైర్మన్ గా వ్యవహరించారు. ఆర్బీఐ డైరెక్టర్ గా.. ఎస్బీఐ..నాబార్డు లోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎకనామిక్ ఇంటలిజెన్స్ కౌన్సిల్ సభ్యుడిగానూ వ్యవహరించారు. ఎఫ్ఎస్ఢీసీ సభ్యుడిగా.. బ్యాంకు బోర్డు బ్యూరో సభ్యుడిగా పని చేసారు. ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులరేటరీ అప్పాయింట్ మెంట్స్ సెర్చ్ కమిటీ సభ్యుడిగానూ రాజీవ్ కుమార్ సేవలు అందించారు. పలు బోర్డులు..కమిటీల్లో పని చేసిన అనుభవం రాజీవ్ కుమార్ కు ఉంది. ఈ నెల 15న బాధ్యతలు చేపట్టనున్న రాజీవ్ కుమార్ దాదాపు ఏడాది కాలం ఆ పదవిలో కొనసాగుతారు. ఆయన హయాంలోనే గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications