ఢిల్లీకి పవర్: ఎంపీలు లేకున్నా..రావాలని పవన్‌కి మోడీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీలో, ఎన్డీయేలో చర్చనీయాంశమయ్యారు. టిడిపి, బిజెపి కూటమికి మద్దతుగా ప్రచారం చేసిన పవన్‌కు బిజెపి ఢిల్లీ నేతలు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా రేపటి ఎన్డీయే కూటమి సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ స్వయంగా పవన్‌కు ఫోన్ చేశారు. రేపటి ఎన్డీయే సమావేశానికి రావాల్సిందిగా కోరారు. పార్లమెంటు బోర్డు సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని కోరారు. దీంతో పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరుతున్నారు. రేపు ఎన్డీయే సమావేశం కానుంది.

పవన్ స్థాపించిన జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ పార్టీకి ఎంపీలెవరు లేరు. అయినప్పటికీ మోడీ, బిజెపి ఆయనకు ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణలో, సీమాంధ్రలో ఆయన చేసిన ప్రచారం వల్లనే తాము మంచి ఫలితాలు సాధించామని బిజెపి భావిస్తోంది. ఈ కారణంగా పవన్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.
పవన్ ప్రచారం తమకు కలిసి వచ్చిందని స్వయంగా టిడిపి, బిజెపిలతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చెబుతున్నారు. పవన్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఆయన ఇంటికి గెలిచిన వారు క్యూ కట్టారు. మురళీ మోహన్, అరికపూడి గాంధీ, కంభంపాటి హరిబాబు.. తదితరులు పవన్‌ను కలిశారు.
ఎన్డీయే సమావేశానికి చంద్రబాబు
మంగళవారం జరగనున్న ఎన్డీయే పక్షాల సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. రేపు ఉదయం పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు.












Click it and Unblock the Notifications