13 రాజ్యసభ స్థానాలకు మోగిన ఎన్నికల నగారా: మార్చి 31లోపు భర్తీ
న్యూఢిల్లీ: దేశంలో మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడక ముందే ఆరు రాష్ట్రాల పరిధిలో 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 31న ఈ ఎన్నికలు జరగనున్నాయి.
పంజాబ్ రాష్ట్రంలో 5, కేరళలో 3, అస్సాంలో 2, హిమాచల్‌ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరనున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఆనంద్ శర్మ, ఏకే ఆంటోనీ, సహా 13 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.

ఏప్రిల్ నెలలో పదవీ కాలం ముగియనున్న రాజ్యసభ్యుల వివరాల్లోకి వెళితే.. ఆనంద్ శర్మ(హిమాచల్‍ప్రదేశ్), రాణీ నరాహ్, రిపున్ బోరా(అస్సాం), ఏకే అంటోనీ, ఎంవీ శ్రేయంస్ కుమార్, కే సోమప్రసాద్(కేరళ), కేజీ కెన్యే(నాగాలాండ్), జర్నా దాస్(త్రిపుర), సుఖదేవ్ సింగ్, ప్రతాప్ సింగ్ బజ్వా, శ్వైత్ మాలిక్, నరేశ్ గుజ్రాల్, శంషేర్ సింగ్ దుల్లో(పంజాబ్) పదవీ కాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది.
కాగా, మార్చి 14న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 24. ఎన్నికలు మార్చి 31న నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చివరిదైన ఏడో దశ ఎన్నికలు సోమవారం ముగిసింది. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసినట్లయింది. మార్చి 10న ఉత్తరప్రదేశ్ తోపాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications