కాంగ్రెస్ మంత్రులు గేలు: రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్య
న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రాందేవ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. బాబా రాందేవ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్రమంత్రులు ‘గే'లని వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కులకు మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ మంత్రుల్లో అత్యధిక మంది గేలు ఉన్నారని రాందేవ్ ఆరోపించారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఇండియన్ పీనల్ కోడ్ 377 సెక్షన్‌ను వ్యతిరేకిస్తున్నారు. కాగా భారతీయ జనతా పార్టీ నాయకులతోపాటు బాబా రాందేవ్ కూడా స్వలింగ సంపర్కం నేరమని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్కం అనేది ఒక వ్యాధి అని, దానిని యోగాతో నివారించవచ్చని బాబా రాందేవ్ పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు తీర్పుతో దేశంలోని చాలామంది స్వలింగ సంపర్కులు, వారి మద్దతుదారులు వారి అసహనాన్ని వ్యక్తం చేశారు. దేశంలోని పలు నగరాల్లో స్వలింగ సంసర్కులకు మద్దతుగా ర్యాలీలు కూడా నిర్వహించారు. ప్రముఖ రచయిత విక్రమ్ సేథ్ కూడా సుప్రీం తీర్పును వ్యతిరేకించారు.
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. స్వలింగ సంపర్కుల విషయంలో సుప్రీం నిర్ణయం తనను కొంత అసహనానికి గురి చేసిందని అన్నారు. సమాజంలో ఈ విధమైన అంశాన్ని ప్రజలు అంగీకరిస్తున్నారని చెప్పారు. స్వలింగ సంపర్కులు కూడా సమాజంలో ఒక భాగంగా ఉన్నారని ఆయన తెలిపారు. భిన్న మనస్తత్వాలు కలిగిన మనుషులు వారి విధానాల్లో ఆలోచిస్తే వారికి న్యాయంగా అనిపిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications