ర్యాపిడో డ్రైవర్ జీతం రూ.10వేలు.. కట్ చేస్తే అకౌంట్లో రూ.300 కోట్లు!
అహ్మదాబాద్‌కు చెందిన ప్రదీప్ ఓడె అనే వ్యక్తి వృత్తిరీత్యా రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన నెలవారీ సంపాదన కేవలం రూ. 10,000 నుండి రూ. 12,000 మధ్య మాత్రమే ఉంటుంది. అయితే ఆయన బ్యాంక్ ఖాతాలో జరిగిన లావాదేవీలు చూసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులే విస్మయానికి గురయ్యారు. ఓ సామాన్య డ్రైవర్ ఖాతా ద్వారా ఏకంగా రూ.300 కోట్లకు పైగా నగదు చేతులు మారడాన్ని గుర్తించిన అధికారులు.. దీని వెనుక భారీ ఆర్థిక నేరపూరిత సిండికేట్ ఉందని నిర్ధారించారు.
కేవలం రూ.25,000 కోసం అద్దెకు అకౌంట్
ఈడీ అధికారుల విచారణలో ప్రదీప్ ఓడె సంచలన విషయాలు వెల్లడించాడు. కిరణ్ పర్మార్ అనే వ్యక్తికి తన బ్యాంక్ ఖాతాను కేవలం రూ.25,000 కు అద్దెకు ఇచ్చినట్లు ఆయన ఒప్పుకున్నాడు. అంతేకాకుండా మోసగాళ్లు అడిగినప్పుడల్లా చెక్కులపై సంతకాలు చేసి ఇచ్చేవాడని.. అందుకు ప్రతిగా ఒక్కో చెక్కుకు రూ.400 అదనంగా తీసుకునేవాడని తెలిసింది. ఇలా నిందితులు ప్రదీప్‌ను ఒక 'మ్యూల్ అకౌంట్' హోల్డర్‌గా వాడుకుని కోట్లాది రూపాయల అక్రమ నగదును చలామణి చేశారు.

నకిలీ కంపెనీలు.. రూ. 550 కోట్ల స్కామ్:
ప్రదీప్ ఇచ్చిన గుర్తింపు పత్రాలను ఉపయోగించి నిందితులు 'ప్రదీప్ ఎంటర్‌ప్రైజ్' అనే ఒక నకిలీ సంస్థను సృష్టించారు. దీనితో పాటు 'కమలేష్ ట్రేడింగ్', 'రౌనక్ ట్రేడర్స్' అనే మరో రెండు బోగస్ కంపెనీలను కూడా కాగితాలపై పుట్టించారు. ఈ మూడు సంస్థల ఖాతాల ద్వారా మొత్తం రూ. 550 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. ఈ నగదును ప్రధానంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ కోసం ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.
స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్, హవాలా:
ఈ ముఠా కేవలం బెట్టింగ్ కే పరిమితం కాకుండా, స్టాక్ మార్కెట్‌లో 'సర్క్యులర్ ట్రేడింగ్'కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. తక్కువ విలువ గల 'పెన్నీ స్టాక్స్' ధరలను కృత్రిమంగా పెంచి, సామాన్య ఇన్వెస్టర్లను ముంచడానికి ఈ అక్రమ నగదును వాడారు. అలాగే హవాలా మార్గాల ద్వారా నగదును మళ్లించడం, ఇంపాక్ట్ గురు వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అనుమానాస్పద విరాళాలు సేకరించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ స్కామ్ వెనుక షేక్ మోయిన్ మొహమ్మద్ షఫీ వంటి కీలక సూత్రధారుల హస్తం ఉన్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది.
విలాసవంతమైన ఖర్చులు, రాజకీయ లింకులు:
ఈ అక్రమ సంపాదనను నిందితులు విలాసవంతమైన జీవితానికి వాడుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. గాంధీధామ్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కుటుంబంలో జరిగిన లగ్జరీ వివాహం కోసం ఈ ఖాతాల నుంచి భారీగా నిధులు మళ్లినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ నగదు ఎవరెవరికి చేరింది అనే అంశంపై దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు, ఆస్తుల జప్తు జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications