Good News : రైతులకు శుభవార్త.. తనఖా లేని రుణాల పరిమితి పెంపు!
వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న , సన్నకారు రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, తనఖా లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణ పరిమితిని రూ. 1.6 లక్షల నుండి రూ. 2 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది. ఈ నిర్ణయం 2025 జనవరి 1 నుండి అమలులోకి వస్తుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఊరటనివ్వనుంది.
ధరల పెరుగుదల వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ సమయంలో, ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు లాభం చేకూరనుంది. దేశంలో 86% కంటే ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. అన్నదాతలు తరచుగా రుణాలు పొందడానికి అనేక ఇబ్బందులు పడుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆస్తులు తక్కువగా ఉన్న రైతుల కోసం తనఖా భారం లేకుండా రుణ సదుపాయాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు కొంత ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది.

కేవలం పంట రుణాలే కాకుండా, అనుబంధ కార్యకలాపాల కోసం కూడా ఈ రుణ పరిమితిని వర్తింపచేస్తుంది. రైతులు తమ ఆదాయ వనరులను ఇది ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ పేర్కొంది. అంతేకాదు, ఈ నూతన రుణ పరిమితిలో తనఖా , మార్జిన్ అవసరాలను బ్యాంకులు పూర్తిగా రద్దు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రైతులకి సకాలంలో సహాయం అందేలా చూడటానికి సవరించిన మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ సూచించింది.
ఈ పథకంతో కలిగే ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో రైతులకు చేరేలా బ్యాంకులు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నాయి. తమ కార్యకలాపాల పరిధిలోని రైతులకు , ఇతర భాగస్వాములకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ముఖ్యంగా, కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) ద్వారా ఆర్థిక సహాయం పొందడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఈ నిర్ణయం, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర పథకాలకు అనుగుణంగా ఉంది. సకాలంలో రుణాలు చెల్లించే వారికి 4% రాయితీ వడ్డీ రేటుతో రూ. 3 లక్షల వరకు రుణాలు అందించే సవరించిన వడ్డీ రాయితీ పథకం (MISS) వంటి ప్రభుత్వ కార్యక్రమాలతో ఇది సమన్వయం చేస్తుంది. స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి , గ్రామీణ ఆర్థిక వృద్ధిని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో ఇవన్నీ భాగంగా ఉంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది..

ప్రముఖ నిపుణులు రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ వ్యవసాయ కనీస మద్దతు ధర (MSP) కమిటీ సభ్యుడు బినోద్ స్వాగతించారు. చిన్న , సన్నకారు రైతులకు తనఖా అవసరం లేకపోవడం అనేది ఒక గొప్ప పరివర్తన అని, ఇది వారి కార్యకలాపాలపై మరింత విశ్వాసం , పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. పెంచిన రుణ పరిమితి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా గ్రామీణ ఆర్థిక కార్యకలాపాలను కూడా పెంచుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు నిజంగా ఒక వరంలాంటిదని ఆయన పేర్కొన్నారు. ఇది వారి ఆర్థిక కష్టాలను తగ్గించడమే కాకుండా, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి , గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఎంతగానో దోహదపడుతుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మరింత ఉత్సాహంతో వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగి దేశ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications