యూపీ పాలిటిక్స్: మాయావతికి బిగ్ షాక్: జంపింగ్స్ షురూ: కొత్త ఈక్వేషన్లు
లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెర మీదికి వస్తోన్నాయి. సమాజ్‌వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన ఓ ప్రకటన అక్కడి ఈక్వేషన్లను సమూలంగా మార్చివేసేలా కనిపిస్తోంది. ఇప్పుడున్న పార్టీలో మనుగడ కష్టంగా మారిన నాయకులు, ఎమ్మెల్యేలు.. రాజకీయాల్లో మరింకొంత కాలం పాటు చక్రం తిప్పాలని భావిస్తోన్న నాయకులు పక్క చూపులు చూస్తోన్నారు. ప్రత్యర్థి పార్టీలో చేరడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు.
ఈ జంపింగ్‌ల వ్యవహారంలో బహుజన్ సమాజ్ వాది పార్టీ ఒకింత నష్టపోయేలా కనిపిస్తోంది. సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యూహాత్మకంగా చేసిన ప్రకటన రాజకీయాలను వేడెక్కించింది. వేరే పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలు, అసమ్మతి నాయకులు, తిరుగుబాటు శాసనసభ్యులు తమ పార్టీలో చేరవచ్చంటూ అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటన ప్రత్యర్థి రాజకీయ పార్టీల్లో కలకలాన్ని రేకెత్తించింది. బహుజన్ సమాజ్ వాది పార్టీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలుగా ముద్రపడి, సస్పెండ్ అయిన ఆరుమంది శాసన సభ్యులు అఖిలేష్ యాదవ్‌ను కలిశారు.

ఈ ఆరుమంది కూడా సమాజ్ వాది పార్టీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ఆరుమందీ తమ పార్టీలో చేరే సమయం వస్తుందని అఖిలేష్ చెప్పారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బీఎస్పీకి ఉన్న సంఖ్యా బలం 18. వారిలో 11 మందిపై అధినేత్రి మాయావతి పార్టీ నుంచి వెలివేయడమో.. లేదా సస్పెండ్ చేయడమే చేశారు. భింగా, ముంగ్రా బాద్‌షాపూర్, లాల్జీ వర్మ, అక్బర్ పూర్ ఎమ్మెల్యే రామ్ అచల్ రాజ్‌భవర్ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఏడాది జరిే అసెంబ్లీ ఎన్నికలకు సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వారంతా అఖిలేష్ యాదవ్‌ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సస్పెండ్ ఎమ్మెల్యలు అఖిలేష్ యాదవ్‌తో సమావేశం కావడంపై బీఎస్పీ స్పందించింది. వారిని తాము ఎప్పుడో సస్పెండ్ చేశామని, వారితో పార్టీకి సంబంధం లేదని బీఎస్పీ అధికార ప్రతినిధి ఉమాశంకర్ సింగ్ చెప్పారు. వారి మీద వ్యాఖ్యానించడం వల్ల తమ పార్టీ నాయకులెవరూ ఎనర్జీని వృధా చేసుకోదలచుకోలేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వైఫల్యాలపై ప్రజలు విసిగి వేసారిపోయారని, ఈ సారి మార్పు తప్పదనీ అంటోన్నారు. కరోనా వైరస్ నిర్వహణ, ఆర్థిక రంగాన్ని పటిష్ఠ పర్చడంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమైందని అఖిలేష్ సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications