ఉద్యోగులకు ఆడీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ.. వీడియో వైరల్ !!
నేటి కాలంలో ప్రైవేట్ ఉద్యోగాలపై అనిశ్చితి రోజు రోజుకు పెరుగుతోంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రారంభమైన ఉద్యోగాల కోతలు.. ఇప్పుడు కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావంతో మరింత వేగంగా సాగుతున్నాయి. పెద్ద పెద్ద సంస్థలే వందల సంఖ్యలో ఉద్యోగులను తగ్గిస్తుంటే, చిన్న సంస్థలు పూర్తిగా మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎప్పుడైనా పని కోల్పోతామో అనే భయంతో ఆందోళనలోనే జీవిస్తున్నారు.
కాగా ప్రస్తుతం ఐటీ నుంచి తయారీ రంగం వరకు అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పనితీరు, మార్కెట్ పరిస్థితులు, టెక్నాలజీ మార్పులు-ఏ కారణం అయినా ఉద్యోగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఏఐ, ఆటోమేషన్ కారణంగా అనేక ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. దీంతో చాలా మంది తమ భవిష్యత్తుపై సందేహాలతో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే చెన్నైకు చెందిన Refex Group ఒక విభిన్న నిర్ణయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ఏకంగా లగ్జరీ కార్లను బహుమతిగా ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచింది.

ఆడి కార్ల బహుమతి..
సంస్థ 12 మంది ఉద్యోగులకు Audi A4 కార్లను బహుమతిగా అందించింది. ఒక్కో కారు ధర సుమారు రూ.47 లక్షల నుంచి రూ.56 లక్షల వరకు ఉండటం విశేషం. సాధారణంగా బోనస్‌లు, గిఫ్ట్ వౌచర్లు ఇస్తారు కానీ ఇలా ఖరీదైన కార్లను ఇవ్వడం చాలా అరుదు. ఈ బహుమతులను 'వీల్ ఆఫ్ అచీవ్‌మెంట్' అనే ప్రత్యేక కార్యక్రమం కింద అందించారు. ఇంధనం, పర్యావరణం వంటి రంగాల్లో పనిచేస్తున్న ఈ సంస్థ, తమ ఉద్యోగుల కృషిని గుర్తించి ఇలా సత్కరించింది. ఇందులో ముఖ్యంగా, సంవత్సరాలుగా సంస్థకు అంకితభావంతో పనిచేసి, బాధ్యతలకు మించి కృషి చేసిన ఉద్యోగులను ఎంపిక చేయడం విశేషం.
ఉద్యోగులే బలం..
ఈ మేరకు సంస్థ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. "ఉద్యోగులే మా అసలైన బలం. వారి కష్టాన్ని గుర్తించి, ప్రోత్సహించడం మా బాధ్యత" అని తెలిపారు. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, సంస్థపై మరింత నిబద్ధత పెంచుతుందని వారు భావిస్తున్నారు. కార్లను అందుకున్న ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందం వ్యక్తం చేశారు. కొందరు ఇది తమ జీవితంలో మర్చిపోలేని క్షణమని చెప్పారు. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ అవుతూ, అనేక మంది ఈ సంస్థను ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం ఉద్యోగ భద్రత తగ్గుతున్న సమయంలో, ఇలాంటి చర్యలు ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచుతాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచి పనికి మంచి గుర్తింపు ఇస్తే, సంస్థ ఎదుగుదల కూడా వేగంగా జరుగుతుందని.. ఈ తరహా ఘటనలు మరిన్ని జరగాలని చెబుతున్నారు. ఈ కాలంలో Refex Group తీసుకున్న ఈ నిర్ణయం ఒక పాజిటివ్ సంకేతంగా మారింది. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి గౌరవిస్తే, వారు కూడా సంస్థ విజయానికి రెట్టింపు కృషి చేస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించింది.












Click it and Unblock the Notifications