ఆపరేషన్ సింధూర్ ట్రేడ్ మార్క్ కోసం రిలయన్స్ పోటీ- విమర్శలతో వెనక్కి
Operation Sindoor Trade Mark: ఆపరేషన్ సింధూర్.. రెండు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ప్రత్యేకించి భారత్, పాకిస్తాన్‌లల్లో. ఈ పేరు వింటే- రోమాలు నిక్కబొడుచుకుంటాయ్ ప్రతి భారతీయుడికి. శతృదేశం పీచమణచడానికి, ఉగ్రవాదులను తుదముట్టించడానికి చేపట్టిన మిషన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏరి కోరి పెట్టిన పేరు ఇది.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మన ఆడవాళ్ల నుదుట రక్తపు తిలకాన్ని దిద్దిన ఉగ్రవాదులను సమూలంగా అంతం చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. సింధూర్ అనే ఇంగ్లీష్ అక్షరాల్లో కుంకుమ భరిణెను జత చేయడం.. హైలైట్. మహిళాలోకం మొత్తం ఈ పేరును ఆరాధిస్తోంది. అప్పుడే పుట్టిన ఆడబిడ్డలకు ఈ పేరు సైతం పెడుతోంది.

అటు పాకిస్తాన్‌లో కూడా ఈ పేరు అందరి నోళ్లల్లో నానుతోంది మరో రకంగా. ఈ పేరు వింటే జడుసుకుంటోంది శతృదేశం. నిద్రలో కూడా ఉలిక్కిపడుతోంది. ఇంతగా ప్రాచుర్యం పొందిన ఆపరేషన్ సింధూర్ కోసం ట్రేడ్ వార్ మొదలైంది. ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి కూడా.
ఆపరేషన్ సింధూర్ ట్రేడ్ మార్క్ కోసం పోటీపడ్డ సంస్థల్లో ఒకటి- దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సైతం ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 140 కోట్ల మందికి పైగా దేశ ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ఆపరేషన్ సింధూర్ ట్రేడ్ మార్క్ కోసం రిలయన్స్ కూడా పోటీపడం విమర్శలకు దారి తీసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో స్టూడియోస్.. ఈ మేరకు ట్రేడ్ మార్క్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. దీనితో పాటు ముంబైకి ముఖేష్ ఛత్రం అగర్వాల్, రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్, ఢిల్లీకి చెందిన అడ్వొకేట్ అలోక్ కొఠారి కూడా ఈ ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.
దీనిపై విమర్శలు చెలరేగడంతో జియో స్టూడియోస్ వెనక్కి తగ్గింది. దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్‌ను ట్రేడ్‌మార్క్ చేసే ఉద్దేశం లేదని తెలిపింది. ఇది- ఇప్పుడు జాతి మొత్తాన్ని చైతన్య పర్చడంలో భాగమైందని, భారత ఆర్మీ ధైర్యసాహసాలకు చిరస్మరణీయ చిహ్నమని పేర్కొంది.
జియో స్టూడియోస్ జూనియర్ ఉద్యోగి ఒకరు అనుకోకుండా ఈ దరఖాస్తును దాఖలు చేశారని వివరణ ఇచ్చింది రిలయన్స్ ఇండస్ట్రీస్. దీనిపై రివ్యూ చేశామని, అనంతరం ట్రేడ్‌మార్క్ దరఖాస్తును ఉపసంహరించుకున్నామని తెలిపింది. ఉగ్రవాదంపై భారత్ రాజీలేని పోరాటానికి మాత్రమే ఆపరేషన్ సింధూర్ పరిమితం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది. ఇండియా ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి ఉన్నామని వివరించింది.












Click it and Unblock the Notifications