భారత్ లో తాజాగా 38,948 కొత్త కరోనా కేసులు, 219 మరణాలు : తొలిసారి ఐదు నెలల్లో అత్యల్ప మరణాలు
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇటీవల కాలంలో నిత్యం కరోనా కేసులలో హెచ్చుతగ్గులు నమోదు అవుతూనే ఉన్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 38,948 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే 8.9 శాతం తక్కువ అని సమాచారం. గత 24 గంటల్లో కరోనా కారణంగా మృతి చెందిన వారు 219 మంది. గత 5 నెలల్లో ఇంత తక్కువ మరణాలు నమోదు కావటం ఇదే తొలిసారి. భారతదేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,40,752 కి చేరుకుంది.

దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 4,04,874
మొత్తం యాక్టివ్ కేసులు 4,04,874 నమోదయ్యాయి .భారతదేశంలో యాక్టివ్ కోవిడ్-19 కేసులు మొత్తం కేసుల్లో 1.23 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో కనీసం 43,903 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారినుండి కోల్పోయిన వారి రికవరీ రేటు 97.44 శాతం గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 3,21,81,995 రికవరీ కేసులు నమోదయ్యాయి. 2.58 శాతం వీక్లీ పాజిటివిటీ రేటు నమోదు అవుతుంది. ఇక ఇది గత 73 రోజులుగా 3 శాతం మార్కు కంటే తక్కువగా ఉంది. గత ఏడు రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు 2.76 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 68.75 కోట్ల డోసుల టీకాలు వేయబడ్డాయని ప్రభుత్వం తెలిపింది.

దేశంలో 3.30 కోట్లను దాటిన కరోనా కేసులు
2020 లో, భారతదేశ కోవిడ్ సంఖ్య ఆగష్టు 7 న 20 లక్షలు, ఆగస్టు 23 న 30 లక్షలు, సెప్టెంబర్ 5 న 40 లక్షలు మరియు సెప్టెంబర్ 16 న 50 లక్షలు దాటింది. సెప్టెంబర్ 28 న 60 లక్షలు, అక్టోబర్ 11 న 70 లక్షలు, అక్టోబర్ 29 న 80 లక్షలు, నవంబర్ 20 న 90 లక్షలు దాటి, డిసెంబర్ 19 న కోటి మార్కును అధిగమించింది. ఇక ఈ ఏడాది వచ్చిన కరోనా సెకండ్ వేవ్ లో ఊహించని విధంగా కేసుల నమోదుతో కలిపి ప్రస్తుతం భారతదేశం యొక్క మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.30 కోట్లను దాటింది.

కేరళలోనే కరోనా ఉధృతి .. నిపా ముప్పులో కేరళ
ఇదిలా ఉంటే భారతదేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులలో అధిక శాతం కేరళ రాష్ట్రం ఉంటే నమోదు కావడం గమనార్హం. కేరళలో, 26,701 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్న కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ మరొక ముప్పుగా పరిణమించింది. ఆదివారం నిపా కారణంగా 12 ఏళ్ల బాలుడు మరణించగా, నిపా ప్రభావంతో ఇబ్బంది పడుతున్న కేరళ రాష్ట్రానికి సహాయాన్ని అందించడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుండి ఒక బృందాన్ని కేరళకు కేంద్రం పంపించింది.

రోజువారీ కేసుల నమోదులో టాప్ 5 రాష్ట్రాలివే
కేరళ రాష్ట్రం తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదు చేస్తున్న, దేశంలోనే అత్యంత ప్రభావితమైన రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 4,057 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 27 మంది మహమ్మారి కారణంగా మరణించారు. కేరళ, మహారాష్ట్ర తర్వాత కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రంగా మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 1623 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు రాష్ట్రంలో 1592 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే తమిళనాడు రాష్ట్రంలో 18 మంది కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందారు. తమిళనాడు తర్వాత ప్రభావితమైన రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రంలో 1117 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా ఎనిమిది మంది మృతి చెందారు.
Recommended Video

దేశానికి డెల్టా ప్లస్ వేరియంట్ భయం
కోవిడ్ -19 యొక్క డెల్టా ప్లస్ వేరియంట్ యొక్క ముప్పు ఇంకా పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది B.1.617.2 జాతి యొక్క ఉత్పరివర్తన వెర్షన్ కాగా దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ డెల్టా అని పిలిచింది. భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగడానికి డెల్టా జాతి కోవిడ్ -19 ప్రధాన కారణమని, ఇది మిలియన్ల మందికి సోకిందని మరియు లక్షలాది మరణాలకు దారితీసిందని తెలుస్తుంది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ఆందోళనల మధ్య భారత దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రభుత్వం పదే పదే నొక్కి చెబుతుంది.












Click it and Unblock the Notifications