ర్యాలీకి విద్యార్థులు: రోజుకు రూ.1200 సంపాదిస్తున్నారు
చెన్నై: ఈ ఏడాది వేసవి మండుతోంది. దీంతో కాలేజీలు, స్కూళ్లకు చాలా త్వరగా వేసవి సెలవులను ప్రభుత్వాలు ప్రకటించాయి. దీంతో విద్యార్ధులు వేసవి సెలవుల్లో చేయాల్సింది సెలవులను సంతోషంగా ఎంజాయ్ చేయడం లేదంటే... వచ్చే ఏడాదికి చదివే తరగతికి సంబంధించిన పుస్తకాలు తిరగేయడం.
కానీ తమిళనాడుకు చెందిన విద్యార్ధులు ఏమి చేస్తున్నారో తెలుసా? వివిధ పార్టీల ర్యాలీల్లో పాల్గొంటూ చేతినిండా డబ్బు సంపాదిస్తున్నారు. తమిళనాడులో మే నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే, డీఎండీకేతో సహా ఇలా చిన్నా చితకా కలిపి మొత్తం పది వరకు పార్టీలు ఉన్నాయి. ఒక్కో పార్టీ ర్యాలీ నిర్వహిస్తే, అందుకోసం కనీసం 20 వేల మందిని నేతలు సమీకరించాల్సి వుంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకేసారి రెండు మూడు పార్టీలు ఒకేచోట ర్యాలీలు నిర్వహించాల్సి వస్తోంది.

దీంతో ర్యాలీలో పాల్గొనేందుకు విద్యార్థులు సైతం ముందుకు రావడంతో వారికి బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఒక రోజు తమ వెంట ఉండి ర్యాలీ, సభలకు హాజరై జేజేలు కొట్టిన వారికి పార్టీలు రూ. 200 నుంచి రూ. 1200 వరకూ ఇస్తుండటంతో, విద్యార్థులు ర్యాలీలకు హాజరయ్యేందుకు ఎంతో ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు.
తాజాగా తమిళనాడు ఎన్నికల్లో కొత్త తరహా ప్రచారం ఊపందుకుంది. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఈ విషయం పడకుండా ఉండేందుకు తమిళ నేతలు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తమ ప్రచార ర్యాలీల నిర్వహణలను ఈవెంట్ మేనేజర్లకు అప్పగిస్తున్నారు.
దీంతో ఈవెంట్ మేనేజర్లు వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి విద్యార్థులను సంప్రదించి, వారిని ర్యాలీలకు పంపుతున్నారు. నిజానికి పార్టీల ర్యాలీల్లో పాల్గొనే పురుషులు, మహిళలతో పోలిస్తే, విద్యార్థులకే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు.
పురుషులకు రూ. 600, మహిళలకు రూ. 800 ఇస్తున్న పార్టీలు, విద్యార్థులు వస్తామంటే పెద్దపీట వేస్తున్నాయని తమిళనాడు లోక్‌సత్తా ప్రతినిధి డి.జగదీశ్వరన్ వ్యాఖ్యానించారు. 'రెంట్-ఎ-క్రౌడ్' పేరిట చెన్నై పరిసరాల్లో అయితే, 10 వేల మంది వరకూ, ఇతర ప్రాంతాలైతే 5 వేల మంది వరకూ విద్యార్థులను ఈవెంట్ మేనేజర్లు సరఫరా చేస్తున్నారని అన్నారు.
విద్యార్ధులు డబ్బు సంపాదించుకునేందుకు ఇదే సరైన సమయమని ఒకే రోజు రెండు ర్యాలీల్లో పాల్గొని రూ. 2 వేలకు పైగా తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. లోక్‌సత్తా పార్టీ ర్యాలీలకు పెద్దగా జనం రావడం లేదని, కేవలం లోక్‌సత్తా పార్టీకి చెందిన వాలంటీర్లు మాత్రమే వస్తున్నారని ఆయన వాపోయారు.












Click it and Unblock the Notifications