• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమ్మినవారే ఆన్‌లైన్‌లో అవమానాలకు గురిచేశారు, వేధింపులు భరించిన యువతుల కథ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అందరూ నన్ను ఇష్టపడతారని అనుకున్నా, నన్ను నేను పాపులర్ చేసుకోడానికి అలా చేశాను. కానీ అది నామీద పూర్తిగా వ్యతిరేక ప్రభావం చూపింది.

బ్రిటన్ డేటింగ్ రియాలిటీ షో 'లవ్ ఐలాండ్' మాజీ స్టార్ జారా మెక్‌డర్మాట్ తాను 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎలాంటి వేధింపులకు గురయ్యారో చెప్పారు.

అది జారా జీవితంలోనే అత్యంత భయంకరమైన సమయంగా నిలిచిపోయింది. స్కూల్లో తనతోపాటూ చదివే ఒక అబ్బాయి ఒత్తిడితో, ఆమె తన అంతరంగిక ఫొటోలు కొన్ని అతడికి పంపించింది.

జారా స్కూల్ జీవితం అంత సరదాగా ఏం గడవలేదు. ఆమెపై ఎప్పుడూ ఒత్తిడి ఉండేది. ఒంటరిగా ఉండేది. ఆ అబ్బాయి తనను ఇష్టపడితే క్లాస్‌లో తోటి అమ్మాయిల్లో తన స్థాయి పెరుగుతుందని అనుకుంది. కానీ, ఆ అబ్బాయి ఆ ఫొటోలు మొత్తం స్కూల్లో వాళ్లకు షేర్ చేశాడు. తర్వాత ఆమె పరిస్థితి దారుణంగా మారింది.

అప్పుడు ఆ అబ్బాయి అలా ఎందుకు చేశాడో కూడా తనకు అర్థం కాలేదని జూమ్ కాల్ ద్వారా బీబీసీతో మాట్లాడిన జారా చెప్పారు.

జీవితంలో చీకట్లు కమ్మేశాయి..

"అది నా జీవితంలో చీకట్లు కమ్మేసిన సమయం. నేను దాక్కోడానికి ప్రయత్నించేదాన్ని. ఆ ఫొటోలను అందరూ చూసేసిన కొన్ని రోజుల తర్వాత నేను చాలా కంగారు పడ్డా. నాకు ఆరోజు ఇప్పటికీ గుర్తుంది. సరిగా తిండి తినలేకపోయేదాన్ని. నిద్రపోవడం కూడా కష్టమైంది. ఎక్కడో మునిగిపోయినట్టు ఉండేది. దీన్నుంచి ఇక ఎప్పటికీ బయటపడలేనేమో అని కుంగిపోయేదాన్ని" అని జారా చెప్పారు.

"నాకు చివరికి ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చేవంటే, పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో అర్థం చేసుకోండి. ఆ ఫొటోలు బయటకొస్తే నన్ను మరింత వేధిస్తారని నాకు తెలుసు. వాటిని నేను భరించగలిగాను. వాటన్నిటి ప్రభావం నాపైన ఇప్పటికీ ఉంది" .

జారా మెక్‌డర్మాట్: రివెంజ్ పోర్న్‌ అనే బీబీసీ త్రీ డాక్యుమెంటరీలో రివెంజ్ పోర్న్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో చూపించారు.

రివెంజ్ పోర్న్ అంటే అంగీకారం లేకుండానే ఇతరుల నగ్న ఫొటోలను షేర్ చేయడం. ఇలాంటివి తరచూ ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో చేస్తుంటారు. జనం రివెంజ్ పోర్న్‌కు ఎలా బలవుతున్నారో ఈ డాక్యుమెంటరీలో చూపించారు.

ఇలాంటి వేధింపుల నుంచి బయటపడ్డానికి ఎలాంటి వ్యవస్థ ఉందనేది కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించారు.

ఒకరిని నమ్మి వారికి తన నగ్న ఫొటోలను పంపిస్తే, వాళ్లు నమ్మక ద్రోహం చేయడం అనేది జారాకు మొదటిసారి జరగలేదు.

2018లో 21 ఏళ్ల వయసులో ఆమె 'లవ్ ఐలాండ్‌' షో కోసం వచ్చినపుడు కూడా ఆమెకు అలాంటి పరిస్థితే ఎదురైంది.

అప్పుడు కూడా ఆమె ఫొటోలను చాలా వాట్సాప్‌ గ్రూప్‌లకు షేర్ చేశారు. కానీ 'లవ్ ఐలాండ్' విల్లాలో ఉన్నప్పుడు ఆమె దగ్గర ఫోన్ లేకపోవడంతో ఆమెకు ఆ విషయాలన్నీ తెలియలేదు.

ఆ షో నుంచి బయటకు వచ్చాక, లవ్ ఐలాండ్‌కు సంబంధించిన ఒక వ్యక్తి హోటల్‌కు వచ్చి జారాకు ఆ విషయం చెప్పాడు. ఆమె ఫొటోలు ఎలా వేగంగా షేర్ అయ్యాయో చెప్పాడు. కానీ అప్పటికే ఆ స్టోరీ మీడియాకు చేరింది.

"ఆ సమయంలో నాకు ఎలా అనిపించిందో చెప్పడం చాలా కష్టం. నేను చేసిన పనికి మా అమ్మనాన్నలు తల దించుకున్నారేమో, వాళ్ల దృష్టిలో అంతకు ముందు జారాలా ఉండగలనా.. అనిపించింది. అది నాకు చాలా సిగ్గుపడాల్సిన సమయం. చచ్చిపోతే బావుణ్ణు అనిపించింది" అని జారా డాక్యుమెంటరీ షూట్ చేస్తున్నప్పుడు చెప్పారు.

రెండు సార్లు బయటికొచ్చిన ఫొటోలు

'లవ్ ఐలాండ్‌'కు వచ్చే ముందు తను ఎవరితో సన్నిహితంగా ఉండేదాన్నో అతడే తన ఫొటోలను లీక్ చేశాడని జారా చెప్పారు. కానీ అతడు మాత్రం అది తన పని కాదని తప్పించుకున్నాడు.

నగ్నంగా ఉన్న తన ఫొటోలు ఒక్కసారి కాదు రెండు సార్లు ప్రపంచం ముందుకు రావడంతో జారా ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారో ఆమె కోపాన్ని బట్టి తెలుస్తుంది.

కానీ, తన ఫొటోలు షేర్ చేసిన వారి మీదనే కాదు, దానిపై ప్రజల స్పందన చూసి కూడా ఆమెకు కూడా కోపం వస్తోంది. ఆన్ లైన్‌లో తనమీద జరిగే ట్రోలింగ్ చూసి ఆమె విసిగిపోయారు. ఒకరి అనుమతి లేకుండా ఫొటోలు ఎలా షేర్ చేస్తారనేది పట్టించుకోని జనం, జారా అసలు వేరే వాళ్లకు తన ఫొటోలు ఎందుకు పంపించింది అని ప్రశ్నించడం మొదలెట్టారు.

ఎవరైనా తమ నగ్న ఫొటోలను భాగస్వామికి ఎలా పంపుతారు అని చాలామంది సీరియస్ అయ్యారు. కానీ ఈరోజుల్లో ఒకరు అలాంటి ఫొటోలను తమ భాగస్వామికి పంపించడం అనేది మామూలు విషయం. కానీ జనం దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే సమాజంలో అలాంటివి నిషిద్ధమని అనుకుంటున్నారు.

నేను ఒక ఆర్టికల్ కింద కామెంట్ చదివాను. అందులో "జారా రివెంజ్ పోర్న్ మీద అవగాహన కల్పించాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె స్వయంగా తన బికినీ ఫోజులు పెడుతుంటారు" అని రాశారు అని జారా చెప్పారు.

"జనం రివెంజ్ పోర్న్ అనే దానిని అసలు అర్థం చేసుకోలేకపోతున్నారు. నాకు తీవ్ర అవమానం జరిగింది. నా నమ్మకాన్ని ముక్కలు చేశారు. అలాంటి చేష్టలతో చట్టాన్ని అతిక్రమించారు. కానీ, బికినీ వేసుకుని ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేయడం చట్టం దృష్టిలో ఏమాత్రం నేరం కాదు" అంటారామె.

రివెంజ్ పోర్న్

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పెట్టిన మాజీ ప్రేమికుడు

రివెంజ్ పోర్న్ బాధితుల్లో జారా ఒక్కరే లేరు.

రివెంజ్ పోర్న్ ఫిర్యాదులు ఎక్కువగా టీనేజర్స్, 10 నుంచి 30 ఏళ్ల మధ్య వారి నుంచి వస్తున్నాయని లైంగిక వేధింపుల కేసులపై పనిచేసే సామాజిక సంస్థ సేఫ్ లైన్ చెప్పారు.

క్లోయీ విషయానికి వస్తే, ఆమె టీనేజీలో ఉన్నప్పుడు ఒక రోజు బస్సులో ఇంటికి వస్తోంది. ఇంతలో స్నాప్‌చాట్‌లో తనకు తెలీని ఒక అకౌంట్ నుంచి ఆమెకు ఒక మెసేజ్ వచ్చింది.

దాన్ని ఓపెన్ చేసిన క్లోయీ షాక్ అయ్యారు. అందులో ఆమె న్యూడ్ ఫొటో ఉంది. ఆ మెసేజ్‌లో సాయంత్రం లోపు ఈ అకౌంట్‌కు నీ న్యూడ్ ఫొటోలు మరిన్ని పంపించకపోతే, దీనిని అన్ని చోట్లా పోస్ట్ చేస్తానని బెదిరించారు.

ఆమె, ఆ ఫొటోను తను తరచూ కలిసే తన మాజీ ప్రేమికుడికి షేర్ చేసింది. కాసేపటికే ఆమెకు మిగతా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి "క్లోయీ నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి ఫొటోలు ఎందుకు పెట్టావ్" అని అడగడం మొదలెట్టారు.

"నా మాజీ ప్రేమికుడు నన్ను మానసికంగా వేధించేవాడు. నా పాస్‌వర్డ్ ఎలాగో కనిపెట్టిన అతడు నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆ ఫొటోలన్నీ పోస్ట్ చేశాడు" అని ఆమె చెప్పారు.

"నాకు వెంటనే ఈ ఫొటోలు మా ఇంట్లోవాళ్లెవరైనా చూస్తే.. నా స్నేహితులకు వీటి గురించి తెలిస్తే ఎలా అనిపించింది. తర్వాత అవి అలా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు షేర్ అవుతూనే ఉంటాయి. నా పరువు పోతుంది. ఈ ఫొటోల గురించి మా ఆఫీసులో కూడా తెలిస్తే, నా ఉద్యోగం పోతుందేమో అనిపించింది" అన్నారు.

"మనసులో ఏవేవో ఆలోచనలు వచ్చాయి. పరిస్థితి దారుణంగా మారింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. మా అమ్మనాన్నలతో మాట్లాడాలంటేనే భయమేసింది" అని క్లోయీ కళ్ల నిండా నీళ్లతో తన అనుభవం చెప్పారు.

"నాకు ఆరోజు గుర్తుంది. రాత్రి ఇంటికొచ్చి నేను, ఒంటరిగా నా గదిలోనే కూర్చున్నా. ఇక నా జీవితం అంతమయినట్లేనా అనిపించింది. జరిగింది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఇక నేను ఎప్పటికైనా అసలు ఎవరినైనా నమ్మగలనా అనిపించింది".

"నా జీవితంలో అది అత్యంత ఘోరమైన కాలం. చీకటి చుట్టుముట్టినట్టు అనిపించింది. మనసులో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయి. ఇక నేను ఎందుకూ పనికిరానేమోనని అనిపించింది" అన్నారు.

భయపడిపోయిన క్లోయీ కొన్ని వారాలు బయటకు కూడా వెళ్లలేదు. చివరికి ఒక ఫ్రెండ్ ఆమెను పబ్‌కు వెళ్లేలా ఒప్పించాడు. రాత్రి అక్కడకు వచ్చిన ఒక అమ్మాయిల గ్రూప్ తమకు వాట్సాప్‌లో వచ్చిన ఆమె న్యూడ్ పొటోల గురించి చెబుతూ అసభ్యకరమైన కామెంట్లు చేశారు.

ఫొటోలను దుర్వినియోగం చేయడం వల్ల, అది ఒకరి మానసిక పరిస్థితిపై ఎంత తీవ్రంగా ప్రభావం చూపిస్తుందో జనం అర్థం చేసుకోవాలని క్లోయీ కోరుకుంటున్నారు.

"నిజం చెప్పాలంటే, నేను నా జీవితంలో ఎప్పుడూ ఇంత ఘోరమైన అవమానాలు ఎదుర్కోలేదు. ముక్కూముఖం తెలీని వాళ్లకు కూడా నా ఫొటోలు చేరాయనేది ఒక పెద్ద షాక్ లాంటిది" అన్నారు.

చట్టాలు ఏం చెబుతున్నాయి

ఒకరి అంగీకారం లేకుండా వారి ఫొటోలు లేదా వీడియోలను వేరేవారు షేర్ చేయడం నేరం అని చట్టాలు చెబుతున్నాయి.

కానీ, ఆ ఫొటోలను తమను అవమానించడనికి, లేదా బాధపెట్టడానికి షేర్ చేశారని బాధితులు నిరూపించగలగాలి. ఈ చట్టాన్ని 2015లో తీసుకొచ్చారు. ఇలాంటి నేరాలకు రెండేళ్ల వరకూ జైలు శిక్ష పడవచ్చు.

కేట్ ఐజాక్ 'నాట్ యువర్ పోర్న్' కాంపైన్ నడుపుతున్నారు. కమర్షియల్ పోర్న్ డిస్ట్రిబ్యూటర్స్ మీద మెరుగైన నియంత్రణ ఉండాలని, అప్పుడే అంగీకారం లేకుండా తీసుకున్న ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లోకి రాకుండా అడ్డుకోవచ్చని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

"ఇలాంటి చేష్టలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని ప్రాక్టికల్‌గా అమలు చేయడం చాలా కష్టం. తప్పుడు ఉద్దేశంతోనే వాళ్లు ఆ ఫొటోలు షేర్ చేశారని మనం నిరూపించగలగాలి. కోర్టులో అది నిరూపించడం చాలా కష్టం. ఆ ఫొటోలను తన స్నేహితులకు చూపించాలనుకున్నానని, పొరపాటున షేర్ అయ్యాయని నిందితుడు తను చేసినవాటిని సులభంగా సమర్థించుకోవచ్చు" అని ఆమె చెప్పారు.

రివెంజ్ పోర్న్ బాధితుల జీవితం అన్ని రకాలుగా నాశనం కావచ్చు. వారు ఏ తప్పూ చేయకపోయినా, బాధతో, అవమానంతో కుమిలిపోవాల్సి ఉంటుంది. ఈ నేరాల బాధితులకు తమ ప్రపంచమే ఆగిపోయిందా అనిపిస్తుంది. ఎవరు ఎదురైనా వీళ్లు కూడా నా ఫొటోలు చూశారేమో అని వాళ్లకు అనిపిస్తుంది. చాలా కేసుల్లో రివెంజ్ పోర్న్ బాధితులు మానసిక ఆరోగ్యం కూడా తీవ్రంగా పాడవుతుంది.

బీబీసీ త్రీ గణాంకాల ప్రకారం ఇలాంటి నగ్న ఫొటోలను దుర్వినియోగం చేసినట్లు రివెంజ్ పోర్న్ హెల్ప్ లైన్‌కు వచ్చిన ఫిర్యాదులు 2020లో 87 శాతం పెరిగాయి. వీటిపై మొత్తం 3136 కేసులు నమోదయ్యాయి.

నగ్నంగా ఉన్న పొటోలను దుర్వినియోగం చేశారని వస్తున్న ఫిర్యాదుల సంఖ్య చాలా పెరిగిందని రివెంజ్ పోర్న్ హెల్ప్ లైన్ మేనేజర్ సేఫీ మోర్టామర్ బీబీసీతో అన్నారు.

రివెంజ్ పోర్న్

నేను చేసింది కూడా నేరమే

క్లోయీ తన మాజీ ప్రేమికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు, ఎక్కువ ఒత్తిడి తెస్తే, నువ్వు కూడా ప్రమాదంలో పడతావని వారు ఆమెను హెచ్చరించారు.

ఎందుకంటే అది జరిగినప్పటికి ఆమె వయసు 18 ఏళ్లు. ఆ వయసులో ఎవరైనా అలా తమ నగ్న ఫొటోలు తీసి, వాటిని వేరే వారికి పంపించడం నేరం. చైల్డ్ ఫొటోగ్రఫీ చట్టం కింద వారిది కూడా నేరంగానే పరిగణిస్తారు.

"పోలీసులు అలా చెప్పడంతో నేను ఆలోచించాను. నేను చేసింది కూడా తప్పే అనిపించింది. ఎందుకంటే, నేను నా ఫొటోను పంపించాను, అది నా నేరం" అని క్లోయీ చెప్పారు.

ఆ తర్వాత చాలా కాలం పాటు ఆమె తను నేరం చేశాననే డిప్రెషన్‌లో ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా దాన్నుంచి బయటపడుతున్నారు.

జారాది కూడా క్లోయీ లాంటి పరిస్థితే. 14 ఏళ్ల వయసులో ఆమె పొటోలు ఇంటర్నెట్‌లో షేర్ అయినప్పుడు, అలాంటి ఫొటోలు తీసుకున్నందుకు ఆమెను స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. కానీ, ఆ పొటోలను షేర్ చేసిన అబ్బాయిని మాత్రం స్కూల్ నుంచి బయటకు పంపించలేదు.

రివెంజ్ పోర్న్ వల్ల తనపై పడిన ప్రభావం గురించి మాట్లాడగలిగేలా ఆ సమయంలో తనకు ఎలాంటి థెరపీ లభించలేదని జారా చెప్పారు. అప్పుడు ఎవరితో అయినా దాని గురించి మాట్లాడుంటే, అది తనకు చాలా సాయం అయ్యుండేదన్నారు.

'నాట్ యువర్ పోర్న్' కాంపైన్‌కు చెందిన కేట్, లైంగిక వేధింపుల కేసుల్లా రివెంజ్ పోర్న్ కేసులను ఎవరూ సీరియస్‌గా తీవ్రంగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.

రివెంజ్ పోర్న్

రివెంజ్ పోర్న్‌ బాధితులు ఏం చేయాలి

ఇప్పుడు తన డాక్యుమెంటరీ రివెంజ్ పోర్న్, దాని పరిణామాల గురించి జనాలకు వీలైనంత అవగాహన కల్పిస్తుందని జారా భావిస్తున్నారు.

ప్రపంచంలోని చాలా మంది రివెంజ్ పోర్న్‌కు బలవుతున్నారు. జారాకు అలాంటి చాల మంది నుంచి మెసేజ్‌లు వస్తుంటాయి. వారంతా ఆమెకు తమ బాధలు చెప్పుకుంటూ ఉంటారు.

"రివెంజ్ పోర్న్‌కు బాధితులైన మహిళలకు మెరుగైన సాయం అందాలి. జనం ఈ కేసుల గురించి వీలైనంత గట్టిగా బాహాటంగా మాట్లాడగలగాలి. దానితోపాటూ తప్పంతా బాధితులదే అని ఆరోపించడం కూడా తగ్గించాలి" అంటారు జారా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Revenge Porn: Believers Insulted Online, The Story of Harassed Young Women
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X