అసెంబ్లీ ఎన్నికలు, మర్డర్ల కౌంట్ డౌన్, ఒకే ఇంట్లో ఇద్దరి పెత్తనం కుదరదు, బీర్ బాటిల్స్ తో !
బెంగళూరు/రామనగర: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి మామూలుగా లేదు. వేసవి కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో రౌడీషీటర్లకు కావలసినంత డబ్బులు ముట్టచెబుతున్న కొందరు నాయకులు మీరు బీర్లలో మునిగి తేలండి. కావలసింత బిర్యానీ తినండి అని చెబుతున్నారని తెలిసింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్బంలో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోని కొందరు రౌడీషీటర్లకు చేతినిండా పనిపడింది. ఇంత కాలం గాలికి తిరుగుతూ అక్కడ ఇక్కడా మామూళ్లు వసూలు చేస్తున్న రౌడీషీటర్లకు ఇప్పుడు జోబులు నిండిపోతున్నాయి. ఒకే ఇంట్లో ఇద్దరి పెత్తనం ఎలా కదురదో అలాగే ఒకే చోట ఇద్దరు రౌడీషీటర్లు ఎదగలేరు అనే పాత సామెత మళ్లీ గుర్తు చేశారు.

బెంగళూరు నగరంలోని సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ లో మంజు అలియాస్ పూలార్ కిరిక్, శివరాజ్ అనే ఇద్దరు రౌడీషీటర్లు ఉన్నారు. ఇంతకాలం సుబ్రమణ్యపురతో పాటు ఉత్తరహళ్లి తదితర ప్రాంతాల్లో రౌడీమామూళ్లు వసూలు చేసుకుంటూ కాలం గడుపుతున్న రౌడీషీటర్లు శివరాజ్, మంజుకు ఇప్పుడు చేతి నిండా డబ్బులు వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
ఆదివారం సాయంత్రం వరకు ఓ పార్టీ తరపున శివరాజ్, మరో పార్టీ తరపున మంజు ప్రచారం చేశారని తెలిసింది. ఆదివారం రాత్రి ఉత్తరహళ్లిలోని ఓ బార్ లో రౌడీషీటర్లు శివరాజ్, మంజు వారి అనుచరులతో కలిసి పీకలదాక మద్యం సేవించారు. ఆ సమయంలో రౌడీషీటర్లు శివరాజ్, మంజుల మద్య చిన్న విషయంలో మాటామాటా పెరిగింది.
ఆ సందర్బంలో సహనం కోల్పోయిన మంజు శివరాజ్ మీద దాడి చేశాడు. శివరాజ్ కూడా రౌడీషీటర్ కావడంతో మంజు మీద అతను దాడి చేశాడు. రెచ్చిపోయిన మంజు బీర్ బాటిల్స్ తీసుకుని శివరాజ్ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. అదే బీర్ బాటిల్స్ పగలగొట్టి శివరాజ్ ను ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు.
తీవ్రగాయాలైన శివరాజ్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడానికి ప్రయత్నించడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే బెంగళూరులో గ్యాంగ్ వార్ మొదలై మర్డర్లకు కౌంట్ డౌన్ మొదలుకావడంతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. రౌడీషీటర్ శివరాజ్ ను హత్య చేసిన మరో రౌడీషీటర్ మంజు దర్జాగా బార్ లో నుంచి వెళ్లిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications