లాలూ ప్రసాద్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత.. రిమ్స్‌లో చేరిక : ఐదేళ్లు జైలు శిక్షతో షాక్
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. లాలూ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ప్రమాదం ఏమీ లేదని వెల్లడించారు. ఆయనకు మెరుగైన చిక్సిత అందిస్తున్నామని చెప్పారు.
లాలూ ప్రసాద్ యాదవ్ మూత్రపిండాలతో పాటు పలు వ్యాధులతో బాధపడుతున్నారు. ఆయనకు కిడ్నీల వ్యాధి స్టేజీ -4 ఉంది. ప్రస్తుతం అవి 20శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తున్నాయి. అటు ఆయనకు బ్లడ్ షుగర్, రక్తపోటు స్థాయి హెచ్చుతగ్గులుగా ఉన్నాయని వెద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో లాలూ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఏడుగురు వైద్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని రిమ్స్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

దాణా కుంభకోణంలో రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈరోజు లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్లు జైలు శిక్షను ఖరారు చేసింది. రూ 60 లక్షల జరిమానా కూడా విధించింది. ఫిబ్రవరి 15న ఈ దాణా కుంభకోణం కేసులో లాలూను దోషిగా తేల్చింది. ఇవాళ కోర్టు శిక్ష ఖరారు చేసింది. లాలూతో పాటు మరో 99 మంది నిందితులపై కూడా కోర్టు విచారణ జరిపింది. వారిలో 46 మందికి మూడేళ్లు జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. 24 మందిని నిర్దోషులుగా తుది తీర్పును వెల్లడించింది. ఈ కోర్టు తీర్పుతో షాక్ తిన్న లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications