బీహార్ లో జవాను కాల్చివేత: రైఫిల్స్ లూటీ
పాట్నా: బీహార్ లో మరో సారి దుండగులు రెచ్చిపోయారు. వారణాసి- బక్సర్ ల మధ్య నడిచే పాసింజర్ రైల్లో దుండగులు దోపిడీకి విఫలయత్నం చేశారు. దుండగులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన రైల్వే ప్రొటెక్షన్ షోర్స్ (ఆర్పీఎఫ్) జావాన్లు మీద కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ఓ జవాను దుర్మరణం చెందగా, మరో జవానుకు తీవ్రగాయాలైనాయి. జవాన్ల దగ్గర ఉన్న రైఫిల్స్ ను దుండగులు లూటీ చేశారు. పలువురికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేయించి వారణాసిలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. దుండగుల కాల్పుల్లో మరణించిన జవాను అభిషేక్ సింగ్ అని రైల్వే అధికారులు చెప్పారు. తీవ్రగాయాలైన మరో జవాను నంద్ లాల్ యాదవ్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు.
రైలులో ప్రయాణికులను నిలువు దోపిడీ చెయ్యడానికి ప్రయత్నించిన సమయంలో ఇద్దరు జవాన్లు అడ్డుకున్నారని, అందువలనే కాల్పులు జరిగాయని రైల్వే సూపరింటిండెంట్ జితేంద్ర మిశ్రా చెప్పారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని జితేంద్ర మిశ్రా తెలిపారు.












Click it and Unblock the Notifications