వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ఆర్ఆర్: ఆస్కార్ అవార్డు రావాలంటే సినిమా ప్రమోషన్ ఏ స్థాయిలో ఉండాలి... అందుకు ఎంత ఖర్చవుతుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆస్కార్

సినిమా రంగంలో ఉన్నవారంతా ఆస్కార్ అవార్డ్ గురించి కలలు కనకుండా ఉండరు. ఆస్కార్ వస్తే అత్యున్నత స్థాయికి చేరుకున్నట్టు భావిస్తారు.

గత ఏడాది కాలంలో, దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆస్కార్ ఫీవర్ పెరిగిందనడంలో సందేహం లేదు. ఈ ఘనత 'ఆర్ఆర్ఆర్' మూవీకే దక్కుతుంది.

ఆర్ఆర్ఆర్ విడుదలై బాక్సాఫీస్ హిట్ కొట్టిన దగ్గర నుంచి ఈ సినిమా ఆస్కార్‌కు వెళుతుందన్న ప్రచారం మొదలైంది. సినిమాను మెచ్చుకుంటూ హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ట్వీట్లు చేయడంతో దేశంలో ఆస్కార్ జపం మొదలైంది.

2023 ఆస్కార్ అవార్డులకు భారతదేశం నుంచి 'ఛెల్లో షో' అనే గుజరాతీ సినిమాను పంపిస్తున్నారని తెలిసినప్పుడు ఆర్ఆర్ఆర్‌ను పంపించలేదనే రుసరుసలూ వినిపించాయి.

ఏదిఏమైతేనేం, చివరికి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలోకి దిగింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' పాటు నామినేట్ అయింది.

ఇంతకూ ఆస్కార్ బరిలోకి దిగడం అంటే ఏంటి? ఒక సినిమా ఆస్కార్ వరకూ ఎలా వెళుతుంది? ప్రమోషన్‌కు, క్యాంపెయింగ్‌కు ఎంత ఖర్చవుతుంది?

ఆస్కార్ బరిలోకి దిగాలంటే..

ఒక సినిమా ఆస్కార్ నామినేషన్‌కు పోటీ పడాలంటే, ఆ సినిమా ప్రొడ్యూసర్ లేదా డిస్ట్రిబ్యూటర్ ఆస్కార్ (అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్)కి అప్లికేషన్ పెట్టుకోవాలి.

విదేశీ చిత్రాలకు సంబంధించి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. అవన్నీ అకాడమీ వెబ్‌సైట్‌లో వివరంగా రాసి ఉంటాయి.

థియేటర్లో రిలీజ్ కావాలి, చిత్రం 40 నిమిషాల కన్నా ఎక్కువ నిడివి ఉండాలి, సబ్ టైటిల్స్ ఉండాలి ఇలా పలు నిబంధనలు ఉంటాయి. 2023కు ఓటీటీలో విడుదలైన సినిమాలకు కూడా పోటీ పడేందుకు అనుమతిచ్చారు.

వీటన్నిటినీ పాటిస్తూ, సినిమా క్రెడిట్స్ అందిస్తూ 'ఆస్కార్ సబ్మిషన్ ఫార్మ్ ' నింపి దరఖాస్తు పెట్టుకోవాలి.

అంటే నిబంధనలకు లోబడి ఉన్న ఏ సినిమా అయినా ఆస్కార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నమాట.

ఇది కాకుండా, భారతదేశం నుంచి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) ఒక సినిమాను అధికారికంగా ఆస్కార్‌కు పంపిస్తుంది. ఆ సంవత్సరంలో వచ్చిన సినిమాలన్నీ పరిశీలించి ఒక బెస్ట్ సినిమాను ఎంపిక చేసేందుకు ఎఫ్ఎఫ్ఐ ఒక కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీ ఎంపిక చేసిన ఆస్కార్ నామినేషన్‌కు పోటీ పడుతుంది. 2023కి గానూ ఎఫ్ఎఫ్ఐ గుజరాతీ సినిమా 'ఛెల్లో షో' ను పంపించింది.

అంటే 'ఆర్ఆర్ఆర్' సినిమా సొంతంగా ఆస్కార్ బరిలోకి దిగిందన్నమాట.

ఇదే కాకుండా 'కాంతారా’, 'విక్రాంత్‌ రోణ’, 'గంగూభాయ్‌’, 'మి వసంతరావ్‌’, 'రాకెట్రీ’, 'తుజ్యా సాథీ కహీ హై’, 'ఇరవిన్‌ నిళల్‌ సినిమాలు 2023 ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి సొంతంగా బరిలోకి దిగాయి.

అయితే, ఇవేవీ ఏ విభాగంలోనూ నామినేట్ అవ్వలేదు.

డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్స్మ్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్స్ కూడా సొంతంగా నామినేషన్ కోసం పోటీ పడవచ్చు.

ఫీచర్ ఫిల్మ్ మాత్రమే కాకుండా పాట, నేపథ్యసంగీతం, కాస్ట్యూం డిజైనింగ్ ఇలా అకాడమీ నిర్ణయించిన ఏ విభాగానికైనా సినిమాను పంపించవచ్చు. ఇది మొదటి అడుగు.

ఆస్కార్

'నామినేషన్, ప్రమోషన్లకు సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది'

సినిమా అప్లికేషన్ వివరాలన్ని అకాడమీ పరిశీలించి, నామినేషన్‌కు అర్హత ఉందో లేదో నిర్థరిస్తుంది.

ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ. భారీ స్థాయిలో క్యాంపెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్రమోషన్స్‌కు కోట్లు ఖర్చు అవుతాయి.

2016లో వెట్రిమారన్ దర్శకత్వం వహించిన 'విచాారణై' (విచారణ) సినిమా భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లింది.

ఆ సమయంలో తన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు వెట్రిమారన్.

ఆస్కార్‌కు సినిమా పంపించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని, సినిమా బడ్జెట్ కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు.

"ఆస్కార్ నామినేషన్‌కు ఒక సినిమా షార్ట్ లిస్ట్ అయిన తరువాత, క్యాంపెయిన్ నిర్వహించడానికి కనీసం రెండు నెలల ముందు నుంచీ అక్కడ (లాస్ ఏంజిల్స్‌లో) తిష్ట వేయాలి. ఆ ఖర్చులన్నీ మనవే.

అన్నిటికన్నా, ముఖ్యంగా ఒక మంచి పీఆర్‌ని వెతికి పట్టుకోవాలి. ఆస్కార్‌లో విదేశీ భాషా చిత్రాల మీద పట్టు ఉన్న పీఆర్ కావాలి. ఇది అత్యంత కీలకం. ఆ స్థాయి పీఆర్‌లు 2-3 మాత్రమే ఉన్నారు. వాళ్లు అంత సులువుగా దొరకరు.

షార్ట్ లిస్ట్ అవ్వడానికి ప్రమోషన్ల మీద కనీసం 15000 డాలర్లు (రూ. 12,24,016), ఒకవేళ నామినేట్ అయితే మరో 5000 డాలర్లు (రూ. 4,08,005) పీఆర్‌కి మాత్రమే ఖర్చు అవుతాయి.

లాజ్ ఏంజిల్స్‌లో పార్టీ, విందులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చాలా లాబీయింగ్ చేయాలి. దీనికి కొన్ని వేల డాలర్లు ఖర్చు అవుతుంది.

నామినేట్ అవ్వాలంటే పత్రికల్లో యాడ్స్ ఇవ్వాలి. 'వెరైటీ', 'ది హాలీవుడ్ రిపోర్టర్' వంటి ప్రముఖ పత్రికల్లో మన సినిమా గురించి యాడ్స్ ఇవ్వాలి. రెండు పత్రికల్లో యాడ్స్ వేయడానికి మాత్రమే 32,000 డాలర్లు (రూ. 26,11,235) ఖర్చు అయింది. మేం నాలుగు యాడ్స్ వేశాం. అయితే, ఇది మాకు కొంత గుర్తింపు తెచ్చింది.

అతిథులను ఆహ్వానించి థియేటర్‌లో మన చిత్రాన్ని ప్రదర్శించాలి. థియేటర్ అద్దెకు తీసుకోవడం, అతిథులకు మర్యాదలు మొదలైనవన్నీ మన ఖర్చులే. క్యాంపెయినింగ్‌కు అనేక వ్యూహాలు ఉంటాయి. అవన్నీ చూసుకోవాలి. వాటికీ చాలా ఖర్చు అవుతుంది" అని వెట్రిమారన్ చెప్పారు.

ఆయన చెప్పిన లెక్కలు చూస్తే ఒక సినిమా ఆస్కార్‌కు నామినేట్ కావాలంటే కోట్లు ఖర్చు అవుతుందని స్పష్టమవుతోంది.

ఆర్ఆర్ఆర్

ఎనభై కోట్లకు పై మాటే..

మామూలుగా ఒక సినిమా విడదల చేసేముందు మార్కెటింగ్ ఎలా చేస్తారో, అలాగే ఆస్కార్ నామినేషన్లకు కూడా మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది.

ఆస్కార్ క్యాంపెయిన్‌‌కు 3 మిలియన్ డాలర్ల నుంచి 10 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు కావచ్చని 'వెరైటీ' మీడియా సంస్థ 2016లో చేసిన ఒక అధ్యయనంలో తేలింది.

అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక 'వెరైటీ' సినిమాలకు సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతుంది.

పారామౌంట్, ఫాక్స్, యూనివర్సల్ లాంటి పెద్ద పెద్ద సినిమా రంగ సంస్థలు ఆస్కార్ ప్రమోషన్లకు భారీగా ఖర్చుపెడతాయని ఆ వార్తపత్రిక పేర్కొంది.

చిన్న సంస్థలైతే 3 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 24.5 కోట్లు) వరకు, పెద్ద సంస్థలైతే 10 మిలియన్ డాలర్ల (రూ. 81 కోట్లు) వరకు ఖర్చు పెడతాయని అంచనా.

'ది గార్డియన్' పత్రిక 2017లో ఆస్కార్ వేడుకకు, సినిమా ప్రమోషన్లకు ఎంత ఖర్చు అవుతుందన్న దానిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అందులో ఇచ్చిన ఖర్చుల అంచనాలు ఇలా ఉన్నాయి.

స్పెషలిస్ట్ పీఆర్ కన్సల్టంట్: 10,000 డాలర్ల నుంచి 15,000 డాలర్లు. (సుమారు రూ. 8,16,045 - రూ. 12,24,067)

అడ్వర్టైజింగ్: నామినేషన్‌కు ముందు 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8 కోట్లు). నామినేషన్ తరువాత 800,000 డాలర్లు (సుమారు రూ. 6 కోట్లు).

టీవీ కమర్షియల్స్, ప్రోమోస్ - 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 12 కోట్లు).

టాలెంట్ కాస్ట్: 900,000 డాలర్లు (సుమారు రూ. 7 కోట్లు). సినిమా ప్రదర్శనకు, ఈవెంట్లకు సినిమాలో నటులను తీసుకురావడం, వారి విమాన ఖర్చులు మొదలైనవి.

సినిమా ప్రదర్శన: సుమారు 160,000 డాలర్లు (సుమారు రూ. 1.3 కోట్లు).

డీవీడీ, డిజిటల్ స్క్రీనింగ్: సుమారు 300,000 డాలర్లు (సుమారు రూ. 2.4 కోట్లు).

ఇతర అవార్డులకు అయ్యే ఖర్చు: 500,000 డాలర్లు (సుమారు రూ. 4 కోట్లు). గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లాంటి వాటికి పెట్టే ఖర్చు. ఇదంతా విస్తృతమైన ఆస్కార్ ప్రమోషన్‌లో భాగంగానే పరిగణిస్తారు.

ది న్యూయార్కర్ అనే పత్రిక (2017) ఆస్కార్ ప్రమోషన్లకు 15 మిలియన్ డాలర్లు (సుమారు. రూ. 122 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా వేసింది.

గతంలో వార్తాపత్రికల్లో మాత్రమే యాడ్స్ ఇచ్చి సినిమాలను ప్రమోట్ చేసుకునేవారు. కానీ, ఇప్పుడు డిజిటల్ క్యాంపెయినింగ్ ఊపందుకుంది. దీనికీ ధారాళంగా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.

క్యాంపెయినింగ్ ఖర్చు పెచ్చుమీరిపోతోందని, సంస్థలు ప్రమోషన్ల కోసం పెట్టే ఖర్చుపై పరిమితి విధించాలని, అప్పుడు న్యాయబద్ధమైన పోటీకి అవకాశం ఉంటుందని హాలీవుడ్‌లో కొందరు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ఖర్చు ఎంత?

2022 మార్చిలో విడుదలైన 'ఆర్‌ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

ఆ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 560 కోట్లు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన హిందీ వెర్షన్ అయితే ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాగా నిలిచింది.

ఇటీవలే 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు వచ్చింది. దాంతో, ఆర్ఆర్ఆర్ టీం ఉత్సాహంగా ఆస్కార్ ప్రమోషన్స్ వైపు అడుగులు వేసింది.

ఆస్కార్ క్యాంపెయినింగ్‌కు రాజమౌళి, ప్రొడ్యూసర్లు కలిసి రూ. 80 కోట్లు కేటాయించారని బాలీవుడ్ హంగామా వెబ్‌సైట్ తెలిపింది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ప్రదానం తరువాత జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ, ప్రజాదరణ కంటే పెద్ద అవార్డు ఉండదు. కానీ, ఆస్కార్ వస్తే గర్వంగా ఇంటికి తీసుకెళతాం అన్నారు.

'నాటు నాటు' పాట ఆస్కార్ నామినేషన్‌కు ఎంపికైందని తెలిసిన వెంటనే రాజమౌళి ట్విట్టర్‌లో ఒక పెద్ద లేఖ రాశారు.

"నా పెద్దన్న కంపోజ్ చేసిన పాట ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఇంతకన్నా ఏం కావాలి! ప్రస్తుతం నేను 'నాటు నాటు' పాటకు తారక్, చరణ్‌ల కన్నా వేగంగా స్టెప్పులేస్తున్నాను. ఆస్కార్‌కు నామినేట్ అవుతామని నేను కలలో కూడా ఊహించలేదు. నాటు నాటు అభిమానులు, ఆర్ఆర్ఆర్ అభిమానులు దీన్ని నిజం చేశారు. వాళ్ల అభిమానమే ఆస్కార్‌కు వెళ్లాలన్న ఆలోచన కలిగించింది" అని చెబుతూ, సినిమా బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది?

95వ అకాడమీ అవార్డులకు నామినీల జాబితా వచ్చేసింది. నామినేషన్‌కు ఎంపికైన సినిమాలన్నిటినీ అకాడమీ సభ్యులు చూస్తారు. అవార్డు ఎవరికి వెళ్తుందో నిర్ణయించేది వారి ఓట్లే.

2023లో అకాడమీలో సుమారు 10,000 మంది ఓటర్లు ఉన్నట్టు సీఎన్‌బీసీ తెలిపింది.

వీరిలో ఒక్కో విభాగానికి చెందిన ఓటర్లు ఉంటారు. వారంతా ఆ విభాగాలకు చెందిన సినిమాలను ఎంపిక చేస్తారు. ఉదాహరణకు ఎడిటర్స్ విభాగంలోని వారంతా బెస్ట్ ఎడిటింగ్ ఫిల్మ్ నామినీలను ఎంపిక చేస్తారు. నటుల విభాగంలో వారు నటులకు ఇచ్చే నాలుగు అవార్డులకు నామినీలను ఎంపిక చేస్తారు.

కానీ బెస్ట్ మూవీకి ఓటర్లు అందరూ నామినీలను ఎంపిక చేస్తారు. ఓటర్లు, మూవీలకు నెంబర్ 1 నుంచి నెంబర్ 10 ర్యాంకింగ్ ఇవ్వాలి. నెంబర్ 1 అంటే బెస్ట్ అని అర్థం. ఏ సినిమాకు ఎక్కువ నెంబర్ 1 ర్యాంకు వస్తుందో అదే బెస్ట్ మూవీ అవుతుంది.

మరి, ఈసారి తెలుగు పాట ఆస్కార్ కొడుతుందో లేదో తెలియాలంటే మార్చి 12 వరకు వేచి చూడాల్సిందే.

"భీమ్.. ఈ న‌క్క‌ల వేట ఎంత‌సేపు..కుంభ‌స్థ‌లాన్ని బ‌ద్ద‌లు కొడ‌దాం ప‌దా" అంటాడు సినిమాలో సీతారామరాజు పాత్రధారి.

ఏనుగంత బడ్జెట్‌తో ప్రమోషన్లు చేస్తున్నారు. మరి కుంభస్థలాన్ని కొడతారా? మరో రెండు నెలల్లో తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

English summary
RRR: What is the level of promotion of a movie to get an Oscar award... how much does it cost?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X