శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. ఈ సీజన్లో దర్శించుకున్న భక్తులు ఎందరంటే!
నిన్నటిదాకా స్వామియే శరణమయ్యప్ప అంటూ మారుమోగాయి శబరిమల గిరులు. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల పూజ కోసం, మకర విళక్కు మహోత్సవం కోసం భారీగా భక్తులు వచ్చి అయ్యప్ప స్వామికి పూజలు చేశారు. ఇక మండల పూజ, మకర విళక్కు పూజ ముగియడంతో నేడు అయ్యప్ప స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు పేర్కొన్నారు.
శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత
ఇక నేడు ఆలయ మూసివేత సందర్భంగా పదంబలం రాజ కుటుంబ ప్రతినిధి అయిన కెత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడంతో ఆ తరువాత ఆలయాన్ని ఉదయం 6 గంటల 30 నిమిషాలకు మూసివేస్తున్నట్టు ట్రావెన్కోర్ దేవస్థానం పేర్కొంది. ఇక రెండు నెలల పాటు అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన వార్షిక పూజల కోసం దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు.

మండల, మకర విళక్కు పూజలు జరిగాయిలా
నవంబర్ 15వ తేదీన అయ్యప్ప స్వామి ఆలయాన్ని తెరవగా, మండల పూజలు అయిపోయిన తర్వాత మళ్లీ డిసెంబర్ 26వ తేదీన ఆలయాన్ని మూసివేశారు. ఇలా 41 రోజుల పాటు సాగిన పూజా కార్యక్రమాలలో లక్షలాదిమంది భక్తులు పాల్గొన్నారు. మళ్ళీ డిసెంబర్ 31 సాయంత్రం నాలుగు గంటలకు శబరిమల ఆలయాన్ని తెరవగా సంక్రాంతి సందర్భంగా మకర విళక్కు సీజన్ పూర్తయ్యే వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేశారు.
మకర విళక్కు మహోత్సవంలో పూజలు ఇలా
తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు ఆలయాన్ని తెరవగా 11 గంటల వరకు ప్రతిరోజు స్వామి వారికి నెయ్యితో అభిషేకం చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం కలభాభిషేకం నిర్వహించారు. తేనే, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, చందనం, విభూతి వంటి ఎనిమిది రకాల పదార్థాలతో స్వామికి అభిషేకాన్ని నిర్వహించారు. ఇక ఈ విధంగా ప్రతిరోజు పూజలు అందుకున్న అయ్యప్ప స్వామికి జనవరి 11వ తేదీన ఎరుమేలిలో పేట తుళ్లై నిర్వహించారు.
ఈ సీజన్ లో అయ్యప్పస్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇదే
ఆపై జనవరి 14వ తేదీన మకర జ్యోతి దర్శనాన్ని కలిగించారు. మకర జ్యోతి దర్శనం చేసుకున్న భక్తుల శరణు ఘోషలతో ఆ ప్రాంతం మారుమ్రోగిపోయింది. ఇక లక్షలాదిగా వచ్చిన జనాలు శబరిమలలో మకర జ్యోతి ని దర్శించుకుని తరించారు. ఈ సీజన్లో 53 లక్షలకు పైగా భక్తులు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నట్టు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు పేర్కొంది .












Click it and Unblock the Notifications