శబరిమల: భక్తులకు కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి..మళ్లీ అప్పుడు తెరుచుకోనున్న ద్వారాలు
శబరిమల: అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు వస్తున్న భక్తులు తప్పనిసరిగా డిసెంబర్ 26 శనివారం నుంచి కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుందని కేరళ హైకోర్టుతో పాటు ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీచేసింది. RT-PCR టెస్టు 48 గంటల ముందు చేసుకోవాలని దానికి సంబంధించిన సర్టిఫికేట్‌ను భక్తులు చూపించాల్సి ఉంటుందని ట్రావెన్‌కోర్ దేవస్వాం బోర్డు వెల్లడించింది. సర్టిఫికేట్ చూపించని భక్తులను అనుమతించబోమని ట్రావెన్‌కోర్ దేవసం బోర్డు ప్రెసిడెంట్ వాసు చెప్పారు.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్యను 5000కు పెంచుతూ కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేరళ హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. కోవిడ్ పరీక్షలను శబరిమలైలో పెంచింది. అయితే అయ్యప్ప స్వామికి అలంకారం చేసే తిరువభరణం ఊరేగింపు కార్యక్రమంలో మాత్రం 100 మంది మాత్రమే పాల్గొనాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమం కోసం పలు చోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాలను కూడా ఆలయ బోర్డు రద్దు చేసింది.

డిసెంబర్ 26వ తేదీన మండల పూజ కార్యక్రమం తర్వాత ఆలయం ద్వారాలు మూసివేయడం జరుగుతుంది. డిసెంబర్ 31వ తేదీన జరిగే మకరవిలక్కు పూజకు తిరిగి ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. కరోనావైరస్ కారణంగా ఆలయాన్ని మూసివేశారు. ఆ తర్వాత తొలిసారిగా శబరిమలై ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కొత్తగా 5వేల కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 46 మంది హెల్త్ వర్కర్లకు వైరస్ సోకింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి 2,930 మంది మృతి చెందగా కొత్తగా 16 మంది చనిపోయారు.