వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబరిమల: అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టిన మహిళల పరిస్థితి ఎలా ఉంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

నాలుగేళ్ల క్రితం ఇదే నెలలో కేరళలోని శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టి ఇద్దరు మహిళలు చరిత్ర సృష్టించారు. సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత పటిష్ఠమైన భద్రత నడుమ వీరు అయ్యప్ప గుడిలోకి ప్రవేశించారు.

10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు గుడిలోకి ప్రవేశించకూడదని శతాబ్దాల నుంచి కొనసాగుతున్న ఆచారానికి ముగింపు పలుకుతూ బిందు అమ్మినీ, కనకదుర్గ ఆనాడు గుడిలోకి ప్రవేశించారు.

అయ్యప్పను ''చిర బ్రహ్మచారిగా’’ పేర్కొంటూ, రుతుచక్రం కొనసాగే మహిళలు గుడిలోకి అడుగుపెట్టకూడదని కొన్ని హిందూవర్గాలు మొదట్నుంచీ దీన్ని వ్యతిరేకించాయి.

గుడిలోకి అడుగుపెట్టే సమయానికి బిందు వయసు 40 ఏళ్లు. ఆమె కంటే కనకదుర్గ ఒక ఏడాది చిన్నవారు.

ఆ రోజు అటవీ మార్గాలతో మొదలుపెట్టి శబరిమల దేవాలయం వరకు హిందూ సంస్థల కార్యకర్తలు నిరసన తెలియజేశారు. ఏళ్లనాటి సంప్రదాయాన్ని వదిలిపెట్టేందుకు తాము సిద్ధంగాలేమని చెప్పారు. అంతేకాదు 50 ఏళ్లకు పైబడిన మహిళలను కూడా వారు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మొత్తంగా సన్నిధానానికి పటిష్ఠ భద్రత నడుమ మహిళలను వారు తీసుకెళ్లారు. ఆ భద్రత నడుమే అయ్యప్పను బిందు, కనకదుర్గ దర్శించుకున్నారు.

సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు తీర్పు తర్వాత...

మత విశ్వాసాల విషయంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు తీర్పు అమలవుతుందో లేదో తెలుసుకునేందుకు ఆనాడు బిందు, కనకదుర్గ ధైర్యంచేసి ముందుకు వెళ్లారు. ఆ ఘటనకు నాలుగేళ్లు పూర్తికావడంతో, ఎలాంటి మార్పులు వచ్చాయని అడిగినప్పుడు.. బిందు అసంతృప్తి వ్యక్తంచేశారు.

''నాలుగేళ్లు గడిచాయి, అంతే. ఏమీ మారలేదు. ఆ ఆచారాల విషయంలో ప్రజలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. మత ఛాందసవాదులతో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) ప్రభుత్వం కూడా ఒప్పందాలు చేసుకుంటోంది’’అని ఆమె అన్నారు.

అయితే, ఆ ఆరోపణలను సీపీఎం నాయకుడు, ప్రొఫెసర్ బాబీ ఖండించారు. ''సుప్రీం కోర్టు ఆ తీర్పును సమీక్షించాలని నిర్ణయించింది. దీంతో ఇదివరకు ఇచ్చిన ఆదేశాలపై స్టే వచ్చింది’’అని ఆయన అన్నారు.

మరోవైపు మహిళపై మన సమాజ ఆలోచనా విధానం అస్సలేమీ మారలేదని కనకదుర్గ వ్యాఖ్యానించారు.

శబరిమల

పరిస్థితి ఎలా ఉంది?

శబరిమల దగ్గర విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రభుత్వం ఇచ్చిన ''హ్యాండ్‌బుక్’’ను కూడా వెనక్కి తీసుకున్న విషయాన్ని బిందు ప్రస్తావించారు.

''అందరు భక్తులను గుడిలోకి అనుమతించాలి. వయసు విషయంలో ఎలాంటి వివక్షా చూపకూడదు’’అని ఆ హ్యాండ్‌బుక్‌లో పోలీసులకు సూచించారు. 2018 అక్టోబరు 28నాటి సుప్రీం కోర్టు తీర్పు అనంతరం దీన్ని పోలీసులకు ఇచ్చారు.

రుతుక్రమ వయసులో ఉండే మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించినట్లు అవుతోందని ఆనాడు 4:1 ఆధిక్యంతో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఆ తీర్పు అనంతరం తాము శబరిమల అయ్యప్ప గుడిలోకి అడుగుపెట్టినట్లు బిందు, కనకదుర్గ ఒక వీడియో ద్వారా వెల్లడించారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కొన్ని హిందూ హక్కుల సంస్థలు నిరసనలు మొదలుపెట్టాయి. దీనిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

నిరసనలు మరింత ఎక్కువ కావడంతో బిందు, కనకదుర్గలకు పోలీసులకు పటిష్ఠ భద్రత కల్పించారు.

ఆ తీర్పు తర్వాత కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఆంక్షలు విధించారు. మళ్లీ ఇటీవల లక్షల మంది భక్తులు శబరిమలకు చేరుకోవడం మొదలైంది. రోజుకు కేవలం 90,000 మంది భక్తులను మాత్రమే అనుమతించాలని ఆలయ బాధ్యతలు చూసుకొనే ట్రావెంకోర్ దేవసోమ్ బోర్డు గత నెలలో నిర్ణయించింది.

జనవరి 26తో ఇక్కడ దర్శనాన్ని నిలిపివేస్తారు. మొత్తంగా ఈ సీజన్‌లో రూ.350 కోట్లు దేవాలయానికి ఆదాయం వచ్చినట్లు బోర్డు వెల్లడించింది.

శబరిమల

గుడిలోకి వెళ్లిన మహిళలకు ఏమైంది?

సంఘ్ పరివార్ కార్యకర్తలు ఇప్పటికీ తనను బెదిరిస్తున్నారని బిందు చెప్పారు. ''గుడిలోకి ఎవరు అడుగుపెట్టినా దాడులు చేస్తామని అంటున్నారు. అందుకే ఎవరూ అడుగుపెట్టే ధైర్యం చేయడం లేదు. ప్రస్తుతం కూడా వారు గుడి ఆవరణలో పెద్ద సంఖ్యలో ఉంటున్నారు’’అని ఆమె అన్నారు.

మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగాలేదని మహిళా హక్కుల కార్యకర్త, టీచర్ దివ్య దివాకర్ చెప్పారు. ''బిందు, కనకదుర్గలపై దాడుల తర్వాత, మిగతా మహిళలు అక్కడికి వెళ్లే ధైర్యం చేయడం లేదు’’అని ఆమె అన్నారు.

ఆ ఏడాది బిందు, కనకదుర్గలతోపాటు దివ్య, మరో మహిళ కూడా గుడిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, తనతోపాటు వచ్చిన మహిళకు నెలసరి కావడంతో దివ్య కూడా గుడికి వెళ్లాలనే ఆలోచన విరమించుకున్నారు.

''మాకు అండగా ఉంటామని చెప్పిన సంస్థలు కూడా నిరసనల నడుమ వెనక్కి తగ్గాయి. దీంతో మళ్లీ పరిస్థితులు మొదటికి వచ్చాయి’’అని బిందు చెప్పారు.

శబరిమల

బిందు, కనకదుర్గలు వ్యక్తిగతంగానూ చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తంగా బిందుపై మూడుసార్లు దాడులు జరిగాయి. వీటి వెనుక సంఘ్ పరివార్ వ్యక్తుల హస్తం ఉందని వార్తలు వచ్చాయి. మొదటగా 2019 నవంబరు 26న కొన్ని హిందూ అతివాద సంస్థల ప్రతినిధులు ఆమెపై దాడిచేశారు.

''నేను కోచి పోలీస్ కమిషనర్ ఆఫీసుకు సమీపంలో ఉన్నప్పుడు నాపై కారం విసిరారు. కొన్ని రసాయనాలను కూడా నాపై చల్లారు’’అని ఆమె చెప్పారు.

ఆ దాడి విషయంలో ఒకరిని అరెస్టు చేశారు. అయితే, ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోలేదని ఆమె చెప్పారు. ''సంఘ్ పరివార్ వ్యక్తులు అతడిని హీరోగా కొనియాడారు’’అని ఆమె వివరించారు.

డిసెంబరు 2021లో ఒక ఆటోరిక్షా ఆమెను గుద్దేసింది. దీంతో ఆమె మొఖానికి గాయాలయ్యాయి. పెదవులపై కుట్లు కూడా పడ్డాయి. ''ఆ ఆటోరిక్షా డ్రైవర్‌ను చీకటి వల్ల సరిగా గుర్తుపట్టలేకపోయాను. కానీ, నంబరు ప్లేట్‌ను చూశాను. అయితే, ఈ కేసులో పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు’’అని ఆమె చెప్పారు.

గత ఏడాది జనవరిలో కోజీకోడ్‌లో ఒక న్యాయవాదిని కలిసి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి బిందుపై దాడిచేశారు.

మరోవైపు 2018లో బిందుకు కల్పిస్తున్న భద్రతను కేరళ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కేరళ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. మళ్లీ బిందుకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు.

ఎందుకు దాడులు జరుగుతున్నాయి?

''నేను దళిత వర్గానికి చెందిన మహిళను కాబట్టే మళ్లీ మళ్లీ దాడి చేస్తున్నారు’’అని బిందు చెప్పారు. ఇక్కడ ఇంతకంటే వేరే కారణాలు లేవని ఆమె వివరించారు.

''నా మీద జరుగుతున్న వరుస దాడులపై సమగ్ర విచారణ చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిజానికి నేను ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక లా కాలేజీలో నేను గెస్ట్ లెక్చరర్‌ను. ఆ జీతమే నా కుటుంబానికి ఆధారం. ఆ ఉద్యోగం నేను చేయాల్సిందే’’అని ఆమె చెప్పారు.

''అసలు బయటకు హాయిగా వెళ్లడానికి నాకు స్వేచ్ఛ లేకుండా అయింది. నేను ఎక్కడికి వెళ్తానో షెడ్యూల్‌ను ముందుగానే ఇద్దరు మహిళా పోలీసులకు వెల్లడించాల్సి వస్తోంది. నేను పంజరంలో బంధించిన చిలుకలా మారిపోయాను’’అని ఆమె వివరించారు.

అసలు కేరళలో జీవించడం చాలా కష్టం అవుతోందని ఆమె చెప్పారు.

ఇదివరకు సామాజిక అంశాలపై బిందుతో కలిసి పనిచేసిన సంస్థలు కూడా ఇప్పుడు ఆమెకు మద్దతు ఇవ్వడం లేదు. ''సంఘ్ పరివార్ వ్యక్తులు దాడులు చేసినప్పుడు, మనకు ఎవరో ఒకరు సాయం చేయాలి. కానీ, ఇప్పుడు అందరూ నాకు దూరం జరుగుతున్నారు’’అని ఆమె చెప్పారు.

శబరిమల

ఇంట్లో వ్యక్తులే దాడి

ఇక కనకదుర్గ విషయానికి వస్తే, ఆమెకు కుటుంబం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. శబరిమలకు వెళ్లి వచ్చిన తర్వాత, పది రోజులు పోలీసుల రక్షణలో గడిపిన ఆమె ఇంటికి వచ్చారు. వచ్చిన వెంటనే ఆమె అత్తయ్య ఆమెపై దాడిచేశారు. దీంతో తల, భుజానికి గాయాలయ్యాయి.

ఆ తర్వాత కనకదుర్గ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగివచ్చిన తర్వాత, ఇంటిలోకి అడుగుపెట్టొద్దని భర్త ఆమెకు సూచించారు.

దీంతో ఆమె కోర్టుకు వెళ్లారు. ఆమె ఇంటిలోకి అడుగుపెట్టొచ్చని కోర్టు సూచించింది. అయితే, ఆమె ఇంటికి వెళ్లినప్పటికి, ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది. తన 12 ఏళ్ల కవల పిల్లను వెంట పెట్టుకుని భర్త, అత్యయ్య విడిగా వెళ్లిపోయారు.

అయినప్పటికీ, భర్తతో కలిసి జీవించాలని ఆమె నిర్ణయించుకున్నారు. అయితే, విడాకులు కోరుతూ ఆయన కోర్టుకు వెళ్లారు.

నవంబరు 2019లో బీబీసీతో మాట్లాడుతూ కనకదుర్గ భావోద్వేగానికి గురయ్యారు. కెమెరా ముందే పిల్లలను తలచుకొని ఏడ్చారు. ''వారు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను’’అని ఆమె చెప్పారు.

కరకదుర్గ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలను కలిసేందుకు అనుమతించాలని కోర్టు ఆమె కుటుంబానికి సూచించింది. అయినప్పటికీ, పిల్లలను చూసేందుకు ఆమె చాలా కష్టపడాల్సి వస్తోంది.

''నేను కోర్టుకు వెళ్లి నా పిల్లలను ఇబ్బంది పెట్టాలని భావించడం లేదు’’అని ఆమె చెప్పారు.

కేసు పరిస్థితి ఏమిటి?

సుప్రీం కోర్టు తీర్పు తర్వాత, దీన్ని సమీక్షించాలంటూ వరుస సమీక్షా పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనానికి ఈ అంశాన్ని బదిలీ చేయాలని నవంబరు 2020లో కోర్టు నిర్ణయించింది.

ఈ కేసులో తీర్పుతో దర్గాలు, మసీదుల్లోకి ముస్లింల మహిళల ప్రవేశంపైనా ప్రభావం పడుతుందని సుప్రీం కోర్టు భావిస్తోంది.

''అయితే, ఈ కేసును పరిశీలించిన చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులు పదవీ విరమణ పొందారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా ధర్మసనాన్ని ఏర్పాటుచేయాల్సి ఉంటుంది’’అని సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ పద్మనాభం చెప్పారు.

సుప్రీం కోర్టు తీర్పును అప్పట్లో అమలు చేయాలని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, బీజేపీతోపాటు ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కూడా ఆ తీర్పును వ్యతిరేకించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sabarimala: What is the condition of women entering the Ayyappa temple?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X