సన్నీపై సాధువులు సీరియస్.. ‘బేబీ డాల్’కు బ్రేక్!
కొత్త సంవత్సరం వేడుకల వేళ ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ డీజే షోపై రేగిన వివాదం ముగిసింది. శ్రీకృష్ణ జన్మభూమి అయిన మథురలోని ఓ ప్రతిష్ఠాత్మక హోటల్‌లో జరగాల్సిన ఆమె కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రాంతంలోని సాంస్కృతిక సంప్రదాయాలు, సాధువుల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
అసలేం జరిగిందంటే?
జనవరి 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు మథురలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో సన్నీ లియోన్ డీజే ప్రదర్శన ఇచ్చేలా ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమం కోసం హోటల్ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు 300 మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించేలా ప్లాన్ చేసి టికెట్లను కూడా వివిధ కేటగిరీలుగా (హట్, కబానా, హై టెర్రస్ సిట్టింగ్, కపుల్ స్టాండింగ్) విభజించారు.

సాధువుల ఆగ్రహం.. కలెక్టర్‌కు లేఖ
సన్నీ లియోన్ కార్యక్రమం గురించి తెలియగానే మథురలోని సాధువులు, మతపరమైన సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ధార్మిక నగరమైన మథురలో ఇటువంటి కార్యక్రమాల ద్వారా అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ షోను వెంటనే నిలిపివేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
నిర్వాహకుల వివరణ
హోటల్ యజమాని మితుల్ పాఠక్ మాట్లాడుతూ.. "సన్నీ లియోన్ కేవలం ఒక ఆర్టిస్టుగా మాత్రమే ఇక్కడ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అన్ని పరిపాలనా, చట్టపరమైన నిబంధనలను పాటిస్తూనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అయితే సమాజం, ధార్మిక సంస్థల భావాలను గౌరవిస్తూ ఈ షోను రద్దు చేస్తున్నాం" అని తెలిపారు. ధార్మిక నగరంలో ఇటువంటి బాలీవుడ్ సెలబ్రిటీల షోల పట్ల స్థానిక ప్రజలు, మతపెద్దలు మొదటి నుంచీ వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా సన్నీ లియోన్ షో రద్దుతో మథురలో నెలకొన్న వివాదం సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications