శంకరరామన్ హత్య కేసు: కంచి స్వాములకు ఊరట
పుదుచ్చేరి: శంకరరామన్ హత్య కేసులో కంచి పీఠాధిపతులకు బుధవారం ఊరట లభించింది. కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సహా మొత్తం ఇరవై మూడు మందిని పాండిచ్చేరి కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును ఈ రోజు వెలువరించింది.
నిందితుల ప్రమేయం పైన దర్యాఫ్తు బృందం సరైన ఆధారాలు చూపించక పోవడంతో వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు పదేళ్ల క్రితం.. 2004 సెప్టెంబరు నెల 3వ తేదిన శంకరరామన్ హత్య జరిగింది. ఈ కేసులో కంచిపీఠాధిపతులతో సహా ఇరవై మూడు మంది ఆరోపణలు ఎదుర్కొన్నారు. న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
శంకరరామన్ హత్య కేసులో దర్యాఫ్తు బృందం 189 మందిని విచారించింది. ఈ కేసు విచారణ తమిళనాడులోని చెంగల్‌పేట కోర్టు నుండి పాండిచ్చేరి కోర్టుకు మార్చాలని జయేంద్ర సరస్వతి కోరారు. దీంతో సుప్రీం కోర్టు తీర్పుతో విచారణను పాండిచ్చేరి కోర్టుకు మార్చారు. ఇప్పుడు వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

ఈ కేసుకు సంబంధించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం జయేంద్ర సరస్వతి పాత్ర పైనే దర్యాఫ్తు జరిగిందని, దర్యాఫ్తు నిష్పక్షపాతంగా జరగలేదని పాండిచ్చేరి కోర్టు అభిప్రాయపడింది.
2004లో ఆలయ ప్రాంగణంలో హత్య జరిగింది. దీనికి సంబంధించి 23 మంది పైన కేసు నమోదయింది. కాంచీపురంలోని చెంగల్‌పట్టు కోర్టు విచారణ చేపట్టింది. తమిళనాడులో నిష్పక్షపాతమైన విచారణ జరగదని జయేంద్ర సరస్వతి సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాలతో 2005లో పాండిచ్చేరి కోర్టుకు బదలీ అయింది. ఈ కేసు విచారణ తొమ్మిదేళ్లు సాగింది.












Click it and Unblock the Notifications