పన్నీరును తప్పించడమేంటి?: మోడీకి శశికళ సీఎం కావడం ఇష్టం లేదా?
తమిళనాడు సీఎంగా శశికళను ప్రతిపాదిస్తూ ఏఐఏడీఎంకే పార్టీ నిర్ణయం తీసుకోవడం కేంద్రానికి రుచించలేదా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
చెన్నై: తమిళనాడు సీఎంగా శశికళను ప్రతిపాదిస్తూ ఏఐఏడీఎంకే పార్టీ నిర్ణయం తీసుకోవడం కేంద్రానికి రుచించలేదా, శశికళ సీఎం కావడం ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలకు అసలు ఇష్టం లేదా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితులు, వస్తున్న ఊహాగానాలను చూస్తే అలాగే కనిపిస్తోంది. శశికళ అతి తొందర్లో ప్రమాణ స్వీకారం చేయాలని భావిస్తుండగా.. అదే సమయంలో గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడులో లేకపోవడం చర్చనీయాంశమైంది.
అదే విధంగాజయ మృతి తర్వాత వేగంగా పరిణామాలు మారి.. రెండు నెలల్లోనే సీఎం పీఠంపై కూర్చుంటున్నారు శశికళ. ఇది కూడా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ వైఖరి కూడా చర్చకు దారి తీసింది.

గవర్నర్‌కు పిలుపు
శశికళను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలని ఏఐఏడీఎంకే పార్టీ నిర్ణయించిన కొద్ది సేపటికే గవర్నర్‌ను తక్షణం ఢిల్లీకి రావాల్సిందిగా కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆదివారమే కుటుంబ సమేతంగా ఊటీ పర్యటనకు వెళ్లిన ఆయన హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు.

పన్నీరును తప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయని శశికళను ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోనుండడంపై ప్రతిపక్ష పార్టీలతో పాటు, మరికొన్ని వర్గాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయంటున్నారు.

ముఖ్యమంత్రి పీఠంపై కన్ను
ఇప్పటికిప్పుడు సీఎం పన్నీర్ సెల్వంను తప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రశ్నించింది. శశికళ మొదటి నుంచి ముఖ్యమంత్రి పీఠం పైనే దృష్టిపెట్టి పావులు కదిపారని విమర్శించింది.

గవర్నర్ చేతిలో..
శశికళ ప్రమాణ స్వీకారం ముహూర్తం గవర్నర్ చేతిలో ఉంది. గవర్నర్ ఓ కేంద్ర మంత్రి కుమారుడి వివాహం కోసం వెళ్లారని చెబుతున్నప్పటికీ తమిళనాడు పరిస్థితులపై కేంద్ర హోంశాఖతో ఆయన చర్చలు జరుపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తమిళనాడు పరిస్థితులపై నివేదిక అందించారని సమాచారం.












Click it and Unblock the Notifications