పోయెస్ గార్డెన్ శశికళ అడ్డా: ఫ్యామిలీ ఫ్యామిలీలే వచ్చేశాయి
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జయలలిత ఇల్లు పోయెస్ గార్డెన్ ఇప్పుడు ఆమె ప్రాణ స్నేహితురాలు నెచ్చెలి శశికళ బంధువర్గం అడ్డాగా మారిపోయింది. ప్రస్తుతం పోయెస్ గార్డెన్ లో ఎక్కడ చూసినా శశికళ బంధువులే దర్శనం ఇస్తున్నారు.
జయలలిత జీవితంలో శశికళకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే శశికళతో విభేదాలు రావడంతో ఆమెను పోయెస్ గార్డెన్ నుంచి బయటకు పంపించేసిన జయలలిత తరువాత మనస్సు మార్చుకున్నారు.
శశికళను ఇంటి నుంచి బయటకు పంపించినా మళ్లీ ఆమెను దగ్గరకు తీసుకున్నారు. అయితే మాత్రం ఇంటిలో ఆమె కుటుంబ సభ్యుల ఉండటానికి జయలలిత అంగీకరించలేదు. నెచ్చెలి శశికళ భర్త నటరాజ్ ను మాత్రం జయలలిత మెడపట్టి బయటకు గెంటేశారు.

గత ఐదు సంవత్సరాల నుంచి పోయెస్ గార్డెన్ లో నటరాజన్ అడుగుపెట్టలేదు. పోయెస్ గార్డెన్ లోకి నటరాజన్ ను పంపించరాదని ఆదేశాలు జారీ చేశారు. అమ్మ చనిపోయాక నటరాజన్ మళ్లీ పోయెస్ గార్డెన్ లో అడుగుపెట్టారు.
అన్నాడీఎంకేలో ఇప్పుడు శశికళతో పాటు ఆమె భర్త నటరాజన్ కీలకంగా మారే అవకాశం ఉంది. పోయెస్ గార్డెన్ లోనే ప్రస్తుతం శశికళ, ఆమె భర్త నటరాజ్ నివాసం ఉంటున్నారు. వారితో పాటు వారి బంధు వర్గం మొత్తం పోయెస్ గార్డెన్ కు మాకం మార్చేసి అక్కడే తిష్టవేశారు.
జయలలిత భౌతికకాయం చుట్టూ శశికళ బంధువులే కనిపించారని ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. జయ కుటుంబ సభ్యులను దగ్గరికి కూడా రానివ్వకుండా చేశారు. అంత్యసంస్కారాలు సైతం శశికళ చేశారు. జయ మేనల్లుడు దీపక్ ను మాత్రం దగ్గరకు తీసుకున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణస్వీకారం చేసినా అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు మాత్రం శశికళ చేతిలోకి వెళ్లాయి. శశికళను తన వారసురాలిగా చెయ్యాలని జయలలిత చివరి కోరికని, అయితే ఆమె కోరిక నెరవేరలేదని నటరాజన్ అన్నాడీఎంకే నాయకులు చెబుతున్నారు.
జయలలిత మనస్సులో పార్టీని శశికళకు అప్పగించాలని లేదని, నటరాజన్ తన భార్యను అందలం ఎక్కించడానికి ఇలా ప్రయత్నాలు చేస్తున్నారని ఓ సీనియర్ మంత్రి అంటున్నారు. ఓ సాధారణ వ్యక్తి అన్నాడీఎంకే పార్టీని నడిపిస్తారని నటరాజన్ చెప్పాడని స్థానిక మీడియాలో వచ్చింది. మొత్తం మీద నటరాజన్ కారణంగా అన్నాడీఎంకేలో చీలిక వస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications
