శశికళపై శశికళ పుష్ప సంచలన వ్యాఖ్యలు, జయపార్టీకి నోటీసులు
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్ప శుక్రవారం నాడు దివంగత జయలలిత నెచ్చెలి శశికళ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్ప శుక్రవారం నాడు దివంగత జయలలిత నెచ్చెలి శశికళ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జయలలితను చిన్నమ్మ శశికళ నటరాజన్ చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు.
అన్నాడీఎంకే చీఫ్‌గా శశికళ పేరును పార్టీ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శశికళ పుష్ప తీవ్రంగా మండిపడ్డారు. శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక చేయడం సరికాదని, ఆ పదవికి జయలలిత ఆమె పేరును ఎప్పుడూ సూచించలేదన్నారు.
అందుకే ఆమెకు కనీసం కౌన్సిలర్ పదవిగానీ, ఎమ్మెల్యే సీటు గానీ ఇవ్వలేదన్నారు. శశికళ రాజకీయాలకు పనికిరారని వ్యాఖ్యానించారు. జయలలిత మృతికి ఇంతకుముందు కుట్ర పన్నినందుకే ఆమెను పార్టీ నుంచి అమ్మ బహిష్కరించారని ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

జయ మృతిపై అనుమానాలున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పార్టీలోనూ పలువురిలో ఇటువంటి అనుమానాలే ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రధాన కార్యదర్శి నియామకం చేపట్టాలంటూ తాను మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానన్నారు.
అన్నాడీఎంకే పార్టీకి హైకోర్టు నోటీసులు
అన్నాడీఎంకే పార్టీకి తమిళనాడు హైకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. పార్టీ నుంచి సస్పెండైన ఎంపీ శశికళ పుష్ప ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం అన్నాడీఎంకే పార్టీకి నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications