నా భార్యది డ్రామా, జయలలిత వైపే: ఎంపీని కొట్టిన శశికళకు భర్త షాక్
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కరించిన ఎంపీ శశికళ పుష్ప వివాదం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ఆమె గత శనివారం విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను చెంప పై కొట్టారు. దీంతో ఆమెను జయలలిత పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
అనంతరం శశికళ పుష్ప పార్టీ అధినేత్రి జయలలిత పైన నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో శశికళ పుష్ప భర్త లింగేశ్వర కూడా ఈ అంశంపై మాట్లాడారు. అయితే తన భార్య చేసిన గందరగోళానికి ఆయన దూరం జరిగారు. తద్వారా అమ్మ జయలలితను దూరం చేసుకునేందుకు ఆయన ఆసక్తి చూపించడం లేదు.
Also Read: ఎయిర్ పోర్ట్లో పురుష ఎంపీ చెంప పగులగొట్టిన మహిళా ఎంపీ
తన భార్య శశికళ వివాదంపై ఆయన స్పందిస్తూ.. తాను ఎప్పుడూ అమ్మకు (జయలలిత) ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. తన భార్య ఈ అంశాన్ని రాద్దాంతం చేశారని, రాజకీయం చేశారని మండిపడ్డారు. ఆమె పెద్ద డ్రామా క్రియేట్ చేశారని విమర్శించారు. ఇదిలా ఉండగా, శశికళ పుష్ప కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు.

శశికళ పుష్ప
ఢిల్లీ విమానాశ్రయంలో మూడు రోజుల కిందట డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ చెంప చెళ్లుమనిపించిన అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షురాలు, తమిళనాడు సీఎం జయలలిత సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, శశికళ రాజ్యసభలో జయలలితపై తీవ్ర ఆరోపణలు చేశారు. జయలలిత తనను రాజీనామా చేయమని బెదిరించారని, తనపై చేయి చేసుకున్నారని ఆరోపించారు.

శశికళ పుష్ప
ఒక్క రోజులో మారిన సీన్‌గత శనివారం శివపై శశికళ చేయిచేసుకొన్ని తర్వాత పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. శివపై దాడి చేయడానికి.. ఆయన తమ పార్టీ అధినేత్రి జయలలితను విమర్శించడమే కారణమని తొలుత పేర్కొన్న శశికళ ఆ తర్వాత జయలలితపైనే ఆరోపణలు చేశారు. దాడి ఘటనపై వివరణ ఇచ్చేందుకు శశికళ ఆదివారం చెన్నైలో జయను కలుసుకొన్నారు.

శశికళ పుష్ప
ఆమెతోపాటు పార్టీ ఎంపీ తంబిదురై కూడా ఉన్నారు. ఈ సందర్భంగా డీఎంకే ఎంపీపై అనవసరంగా చేయిచేసుకుని పార్టీ పరువు మంటగలిపావంటూ జయ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత గంటల్లో సీన్ మారిపోయింది. సోమవారం ఉదయం రాజ్యసభలో శశికళ మాట్లాడుతూ... డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ పట్ల తనకెంతో గౌరవం ఉందని, ఆయనపై చేయిచేసుకొన్నందుకు చింతిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనపై తమ పార్టీ అధ్యక్షురాలికి వివరణ ఇచ్చానని, ఆ సమయంలో తనతోపాటు ఎంపీ తంబిదురై కూడా ఉన్నారన్నారు.

శశికళ పుష్ప
ఆ తర్వాత జయలలితపై ఆరోపణలు చేశారు. ఇవి కలకలం రేపాయి. తనను తక్షణమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయమని జయ బెదిరించారని, అంతటితో ఆగకుండా తనను కొట్టారని శశికళ ఆరోపించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా తాను రాజీనామా చేయనని, తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు భద్రత కల్పించాలని విలపించారు. ఊహించని ఈ సంఘటనతో సభలోని అన్నాడీఎంకే సభ్యులంతా దిగ్ర్భాంతికి గురయ్యారు.

శశికళ పుష్ప
డిప్యూటీ స్పీకర్ కురియన జోక్యం చేసుకుని ఆమెకు తగు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సభలో లేని వారిపై ఆరోపణలు చేయవద్దని సూచించారు. అన్నాడీఎంకే సభ్యులంతా లేచి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించగా.. కేంద్రమంత్రి వెంకయ్య జోక్యం చేసుకుని.. సభ్యురాలు తన భద్రత గురించి ఆందోళన చెందితే సభాధ్యక్షుడికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

శశికళ పుష్ప
శశికళ ఇంకా మాట్లాడుతూ.. జయలలితను తాను ఎంతగానో గౌరవిస్తానని, ఆమె వల్లే తనకు ఎంపీ పదవి లభించిందని, అయితే తనపై చేయిచేసుకునే హక్కు ఆమెకు లేదన్నారు. తమిళనాట తనకు భద్రత ఉండదని, తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందంటూ కంట తడి పెట్టారు. ఆ సమయంలో అన్నాడీఎంకే ఎంపీలంతా లేచి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ జోక్యం చేసుకుని శశికళకు తగిన భద్రత కల్పిస్తామని చెప్పారు.