నాతో 15 నిమిషాల చర్చకు సిద్ధమా: మోడీకి రాహుల్ సవాల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'సేవ్ ది కాన్‌స్టిట్యూషన్(రాజ్యాంగ పరిరక్షణ)' ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ సవాలు విసిరారు రాహుల్. రాహుల్ గాంధీ సోమవారం 'సేవ్ ది కన్‌స్టిట్యూషన్' కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ' ప్రధాని మోడీ నన్ను పార్లమెంటులో ఎదుర్కోలేరు. నాతో కనీసం 15 నిమిషాల పాటు చర్చకు కూడా ధైర్యం చేయలేరు. ఇప్పుడు ఆయన దృష్టంతా మళ్లీ ప్రధాని కావడం మీదే ఉంది. మోడీజీ నాతో చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా?' అంటూ రాహుల్ గాంధీ సవాల్ విసిరారు.

బీజేపీ పరిపాలనలో మహిళల భద్రత, దళితుల రక్షణ, పేదల సంక్షేమం పూర్తిగా మరుగున పడ్డాయని ఆరోపించారు. రాజ్యాంగానుసారం నడుచుకొంటున్న కొన్ని సంస్థలు ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలతో నిండిపోయాయన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా యువతకు ఇస్తామన్న ఉద్యోగాల పరిస్థితి ఏమైందని ఈ సందర్భంగా రాహుల్ ప్రశ్నించారు.
లోక్‌సభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇంతవరకు పట్టాలెక్కకుండానే ప్రధాని మళ్లీ కొత్త హామీలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. బేటీ బచావో-బేటీ పడావోలో భాగంగా బాలికలను చదివించడం కాదు. ముందు బాలికలను బీజేపీ ఎమ్మెల్యేల నుంచి కాపాడాలని ఉన్నావ్ ఘటనను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసే పనిలో భాగంగానే దళితులపై, పేదలపై దాడులు జరుగుతున్నాయని రాహుల్ అన్నారు.












Click it and Unblock the Notifications