సుప్రీంకోర్టు ఆదేశాలతో దిగొచ్చిన ఎస్బీఐ: ఈసీకి ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘాని(ECI)కి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) దిగొచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీకి సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రకారం మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా ఎన్నికల సంఘం కూడా ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాల్సి ఉంది.
అంతకుముందు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో ఎస్‌బీఐ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన సర్వోన్నత న్యాయస్థానం.. సమాచారం అందుబాటులో ఉన్నా ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడాన్ని తప్పుబడుతూ బ్యాంకు అభ్యర్థనను కొట్టివేసింది.

మార్చి 12న బ్యాంకు పనివేళలు ముగిసేలోపు మొత్తం వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అనుసరించి ఎన్నికల బాండ్ల వివరాలను మంగళవారం సాయంత్రం ఈసీకి స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) సమర్పించింది.
కాగా, ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018లో తీసుకొచ్చింది. దీనికింద ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 30 విడతల్లో దాదాపు 28వేల బాండ్లను ఎస్‌బీఐ విక్రయించింది. వీటి మొత్తం విలువ రూ.16,518 కోట్లు. అయితే, ఎన్నికల బాండ్ల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), సీపీఎం పిల్‌లు దాఖలు చేశాయి. వీటిపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎన్నికల బాండ్లు చట్టవిరుద్ధమైనవంటూ ఫిబ్రవరి 15న 232 పేజీల తీర్పును ఏకగ్రీవంగా వెలువరించింది.
ఇది ఇలావుండగా, ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ రాష్ట్రపతికి లేఖ రాసింది. సుప్రీం తీర్పుపై రాష్ట్రపతి రిఫరెన్స్ కోరాలని ఆమెకు రాసిన లేఖలో పేర్కొంది. వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కార్పొరెట్ల పేర్లను వెల్లడించడం వల్ల వారు వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది.












Click it and Unblock the Notifications