శశికళకు షాక్ మీద షాక్: విచారణకు సుప్రీం ఓకే, క్యాంప్ రాజకీయాలపై..
అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పైన సుప్రీం కోర్టు రేపు (శుక్రవారం) విచారణ చేపట్టనుంది.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పైన సుప్రీం కోర్టు రేపు (శుక్రవారం) విచారణ చేపట్టనుంది. చెన్నైకి చెందిన ఓ స్వచ్చంధ సంస్థ శశికళకు వ్యతిరేకంగా పిటిషన్ వేసింది. దీనిని అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నిక కావడంపై సదరు సంస్థ సుప్రీంను ఆశ్రయించింది. శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగానే పిటిషన్ దాఖలైంది.
క్యాంపు రాజకీయాలపై హైకోర్టు పిటిషన్
తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. బల నిరూపణ సమయంలో ఎమ్మెల్యేలు గోడ దాటకుండా ఉండేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వారిని చెన్నై శివారులోని రిసార్టులకు తరలించిన వి,యం తెలిసిందే.

నిన్నటి నుంచి వారంతా అక్కడే బస చేస్తున్నారు. అయితే దీనిపై సామాజిక కార్యకర్త ఒకరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. శశికళ ఎమ్మెల్యేలను అక్రమంగా నిర్బంధించారని పిటిషన్ దాఖలు చేశారు. ఇలా వరుస సుప్రీం కేసులు శశికళకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి.
శశికళ తన శిబిరంలోని 130 మంది ఎమ్మెల్యేలను ఎవరూ ప్రలోభ పెట్టకుండా రహస్య ప్రదేశాలకు తరలించారు. వారంతా ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు అనే అంశంపై తమిళనాడులో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
బుధవారం మధ్యాహ్నం పార్టీ సమావేశం ముగియగానే అందరినీ లగ్జరీ బస్సుల్లో ఎక్కించి రహస్య ప్రాంతానికి తరలించారు. వీరంతా చెన్నై శివారుల్లోని కొన్ని రిసార్టుల్లో ఉన్నారు. 130 మంది ఎమ్మెల్యేలు బృందాలుగా విడిపోయి శివారుల్లోని వేర్వేరు లగ్జరీ రిసార్టుల్లో బస చేస్తున్నారు.
బీచ్‌లు, మసాజ్‌లు, వాటర్ స్కైయింగ్ సదుపాయాలతో ఉన్న లగ్జరీ రిసార్టుల్లో వారు సకల సౌకర్యాలు అనుభవిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. తమిళనాడు శాసనసభలో పన్నీర్‌సెల్వం, శశికళకు మధ్య బలనిరూపణ జరిగే అవకాశముంది. గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైకి రాగానే శశికళ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో కలిసి ఆయనతో భేటీ అయ్యే అవకాశముంది.












Click it and Unblock the Notifications