కేరళలో 11వ తరగతి పరీక్షలపై సుప్రీంకోర్టు స్టే: రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన కేసులు, 30వేల దిగువకు
తిరువనంతపురం: కేరళలో కరోనావైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేరళలో వచ్చే వారం నుంచి జరగనున్న 11వ తరగతి పరీక్షల నిర్వహణఫై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను ప్రమాదంలో పెట్టడం సరికాదని అభిప్రాయపడింది.
కేరళలో సెప్టెంబర్ 6 నుంచి 11వ తరగతి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు.. కేరళ ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర స్టే విధించింది.

కేరళలో కరోనా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రోజుకు దాదాపు 35వేల కరోనా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70 శాతం కేసులు ఇక్కడే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వయసు పిల్లలను ప్రమాదం బారిన పడేయలేం అని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.
ఇది ఇలావుండగా, కేరళలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా, 1.63 లక్షల నమూనాలను పరీక్షించగా.. 29,322 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41.51లక్షలకు చేరింది. గత 24 గంటల్లో కరోనావైరస్ బారినపడి 131 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 21,280కి పెరిగింది.
Recommended Video
తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 41,51,455కు పెరిగింది. శుక్రవారం మరో 22,938 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 38,83,186కు చేరింది. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,46,437కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 17.19 శఆతంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
త్రిస్సూర్‌లో శుక్రవారం అత్యధిక పాజిటివ్ 3,530 కేసులు నమోదయ్యాయి. ఎర్నాకులంలో 3,435 కేసులు, కోజికోడ్ లో 3,344 కరోనా కేసులు నమోదయ్యాయి.
మరోవైపు, భారతదేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గురువారం రెండు నెలల గరిష్టానికి చేరిన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. మరోపక్క కరోన థర్డ్ వేవ్ ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. గత 24 గంటల్లో భారతదేశంలో 45,352 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక రోజు 366 మరణాలు నమోదయ్యాయి. దీనితో, దేశం మొత్తం కేసుల సంఖ్య 3,29,03,289 కి పెరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 4,39,895 కి పెరిగింది.
గత 24 గంటల్లో 34,791 కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు ఇప్పుడు 3,99,778 కి చేరుకున్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 97.45 శాతంగా ఉంది. ఇప్పుడు వరకు దేశవ్యాప్తంగా 3.20 కోట్ల మంది కరోనా మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. రికవరీల కంటే కొత్త కేసులు పెరుగుతున్న తీరు భారతదేశానికి ఆందోళన కలిగిస్తుంది. క్రియాశీల కేసుల రేటు 1.22 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. నిన్న74 .84 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తంగా 67.09కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications