ఆధార్ కార్డుపై ఉత్తర్వుల్ని సవరించలేం: సుప్రీం
ఢిల్లీ: ఆధార్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్), వంటగ్యాస్ రాయితీ బదలాయింపులకు అదనంగా వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డుల సమాచారాన్ని స్వచ్ఛందంగా వినియోగించుకునేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది.
దీనిపై జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని సవరించలేమని స్పష్టం చేసింది. సవరణలు, వివరణలు, సడలింపులు కోరుతూ వచ్చే అన్ని రకాల అభ్యర్థనల్ని విస్తృత రాజ్యాంగ ధర్మాసనమే పరిశీలిస్తుందని తేల్చిచెప్పింది.
పీడీఎస్, ఎల్పీజీ మినహా ఇతర అవసరాల కోసం ఆధార్‌ను వినియోగించరాదని ఆగస్టు 11న సుప్రీంకోర్టు ఆదేశించింది. వయోవృద్ధులు, బలహీనవర్గాలవారికి వివిధ పథకాలను అందించడానికి ఆధార్‌ను ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని కేంద్రం, ఆర్‌బిఐ, సెబీ, ట్రాయ్, ఐఆర్‌డిఎ, పింఛన్ నిధి నియంత్రణ సంస్థలతో పాటు గుజరాత్, ఝార్ఖండ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలూ గట్టిగా కోరుతున్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

గోప్యత హక్కు వంటి అంశాలను నిర్ణయించడానికి వీలుగా ప్రధాన అర్జీలనే రాజ్యాంగ ధర్మాసనానికి బదలాయించినప్పుడు ఇలాంటి మధ్యంతర అభ్యర్థనల్ని తామెలా స్వీకరించగలమని ధర్మాసనం తొలుత ప్రశ్నించింది.
కాగా, దేశంలో 90 కోట్ల మందికి ఇప్పటికే ఆధార్ కార్డులు జారీ అయ్యాయని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తెలిపారు. ఆధార్ కార్డు తప్పనిసరి కాదని న్యాయస్థానం చెప్పినందు వల్ల వ్యక్తుల గుర్తింపు నిమిత్తం స్వచ్ఛందంగా దీనిని వాడుకునేలా అనుమతించడంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఆయనన్నారు.












Click it and Unblock the Notifications