ముస్లింలపై మూక దాడులు-కేంద్రంతో పాటు 6 రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు..
దేశవ్యాప్తంగా ముస్లింలపై పెరుగుతున్న మూకుమ్మడి దాడులకు సంబంధించి గతంలోనే కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. ఇవాళ మరో పిల్ విచారణ సందర్భంగా ఇంకోసారి నోటీసులు పంపింది. ముస్లింలపై మూక దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు గతంలో దీనిపై ఆదేశాలు ఇచ్చినా దాడులు ఆగకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు, ఆదేశాలు ఇచ్చినప్పటికీ ముస్లింలపై హత్యలు, మూక హింస కేసులు భయంకరంగా పెరుగుతున్న దృష్ట్యా తక్షణ జోక్యం చేసుకోవాలని కోరుతూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం కేంద్రంతో పాటు ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా పోలీసు ఉన్నతాధికారులకు నోటీసు జారీ చేసింది.

ముస్లింలపై మూకుమ్మడి హింస ఘటనలు భారీగా పెరుగుతున్నట్లు సుప్రీంకోర్టు గుర్తించింది. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, వివిధ హైకోర్టుల అధికార పరిధిని ప్రయోగించడం వ్యర్థమని వాదించారు. పిటిషనర్‌ను సంబంధిత హైకోర్టుకు తరలించమని కోరితే ఏమీ జరగదని, ఈ ప్రక్రియలో బాధితులకు న్యాయం జరగదని సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో స్వయంగా సుప్రీంకోర్టు డీజీపీలకు నోటీసులు జారీ చేసింది.
2018లో సుప్రీంకోర్టు పూనావాలా కేసులో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ముస్లింలపై మూక దాడుల విషయంలో సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసిందని లాయర్ కపిల్ సిబల్ తెలిపారు. అయినా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వీటిని నిరోధించడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. తాజాగా జూన్ 28న బీహార్ లోని సరాన్ జిల్లాలో 55 ఏళ్ల ట్రక్ డ్రైవర్ జలాలుద్దీన్ పై జరిగిన దాడిని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. జూన్ 24న ముంబైలోని బీఫ్ తరలిస్తున్నారనే ఆరోపణలపై అఫాన్ అన్సారీ, నాసిర్ హుస్సేన్ అనే ఇద్దరు వ్యక్తులపైనా ఇలాగా దాడి జరిగిందన్నారు. దీనిపై స్పందించిన కోర్టు నోటీసులు ఇచ్చింది.












Click it and Unblock the Notifications