రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేయాలనే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం నిర్ణయంపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ముగ్గురు ఖైదీలు సుతేంద్రరాజా అలియాస్ శంతన్, వి శ్రీహరన్ అలియాస్ మురుగన్, ఎజి పెరారివలన్ అలియాస్ అరివ్‌ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాజీవ్ హత్య కేసులోని ఆ ముగ్గురు దోషుల ఉరిశిక్షను కోర్టు జీవిత ఖైదుగా మార్చిన విషయం తెలిసిందే. రాజీవ్ గాంధీ హంతకులకు శిక్షను తగ్గించేందుకు తమిళనాడు ప్రభుత్వానికి అనుమతి లేదంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.

మార్చి 6వ తేదీ వరకు ఖైదీలను విడుదల చేయవద్దని సుప్రీంకోర్టు వెల్లూరు జైలు అధికారులను, తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ రోజు మరోసారి కేంద్రం పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపుతుంది.
రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలనే జయలలిత ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉదయం పిటిషన్ దాఖలు చేసింది. ఆ ముగ్గురు ఖైదీలపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కూడా సుప్రీంకోర్టు కోరింది. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications