యూపీలో 183 ఎన్‌కౌంటర్లు: సుప్రీంకోర్టు జోక్యం: సీజేఐకి సీల్డ్ కవర్ లెటర్
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్, సమాజ్‌వాది పార్టీ లోక్‌సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రాఫ్ అహ్మద్ దారుణ హత్యోదంతం- తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 24వ తేదీన లిస్టింగ్ చేసింది. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ జంట హత్యలపై సమగ్రంగా విచారణ చేపట్టనుంది.
సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ విశాల్ తివారీ.. ఈ పిల్‌ను దాఖలు చేశారు. ఇటీవలే అతిక్ అహ్మద్ కుమారుడు అసద్‌ను ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అతని అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్‌పై ముగ్గురు వ్యక్తులు ప్రయాగ్ రాజ్‌లోని ఓ ఆసుపత్రి వద్ద అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు.

మెడికల్ చెకప్ కోసం ఆసుపత్రికి తరలిస్తోన్న సమయంలో బైక్‌పై వచ్చిన లవ్‌లేష్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్య అనే ముగ్గురు వ్యక్తులు వారిని కాల్చి చంపారు. పోలీసుల అదుపులో, మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కాల్పులకు తెగబడిన ముగ్గురినీ పోలీసులు సంఘటన స్థలంలోనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారు విచారణలో ఉన్నారు.
ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకున్న ఈ హత్యోదంతం.. ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతల వైఫల్యాన్ని చాటుతోందంటూ అడ్వొకేట్ విశాల్ తివారీ వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వతంత్రంగా పని చేసే ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు కావాలని కోరారు.
2017 నుంచి ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్‌లో 183 ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయని, అందులో ఫేక్ ఎన్‌కౌంటర్లే అధికంగా ఉన్నాయని విశాల్ తివారీ చెప్పారు. వాటన్నింటిపైనా సీబీఐ అధికారులు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయాన్నింటినీ తాను పిల్‌లో పొందుపరిచినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యం వ్యవస్థ, రూల్ ఆఫ్ లాను కించపర్చినట్లుగా భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.
శాంతిభద్రతలను కల్పించడం అంటే గ్యాంగ్‌స్టర్లను బహిరంగంగా కాల్చి చంపడం కాదని విశాల్ తివారీ అన్నారు. అతిక్ అహ్మద్ రాసిన లెటర్‌ను సీల్డ్ కవర్‌లో పెట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పంపించినట్లు వివరించారు. తాను దాఖలు చేసిన ఈ పిల్ప్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 24వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications