వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

SCO: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అమెరికా వ్యతిరేక కూటమిగా మారుతోందా, దీనితో భారత్‌కు ఎదురయ్యే ఇబ్బందులేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మోదీ, పుతిన్ - 2017 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో

ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో రెండు రోజుల పాటు జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం శుక్రవారం ముగిసింది. ఈ సమావేశంలో హాజరయ్యేందుకు వెళ్లిన భారత ప్రధాని మోదీ పలువురు దేశాధినేతలను కలిశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్‌తో చర్చలు జరిపారు.

కానీ, ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌తో మాత్రం సమావేశం కాలేదు.

2019 ప్రారంభంలో బిష్‌కెక్‌లో జరిగిన సమావేశంలో సభ్య దేశాల నాయకులందరూ సమావేశమయ్యారు. తిరిగి కోవిడ్ మహమ్మారి తర్వాత సభ్య దేశాల నాయకులందరూ కలవడం ఇదే మొదటిసారి.

సమర్‌కండ్‌లో మోదీ పుతిన్‌ల మధ్య చోటు చేసుకున్న సమావేశం చర్చనీయాంశమయింది. దీంతో పాటు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) అమెరికా వ్యతిరేక కూటమిగా మారుతోందా అనే అంశం కూడా చర్చకు వచ్చింది. ఇదే వాస్తవమైతే, భారతీయ విదేశాంగ విధానానికి ఎదురయ్యే అతి పెద్ద సవాలు ఏంటి?

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌ లో కేవలం చైనా, రష్యా మాత్రమే కాకుండా ఇరాన్ కూడా ఈ కూటమిలో పర్యవేక్షక స్థాయిని కలిగి ఉండటం చూస్తుంటే, ఇది అమెరికా లేదా పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా రూపొందుతున్న కూటమి అని చెప్పొచ్చు అని కొందరు వాదిస్తారు.

ఇరాన్ ఈ కూటమిలో పూర్తి సభ్యత్వం పొందేందుకు అవగాహన ఒప్పందం పై సంతకం చేసినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఈ సమావేశానికి ముందు తెలిపారు. వచ్చే ఏడాది ఇరాన్ ఈ కూటమిలో పూర్తి సభ్యత్వం పొందుతుంది.

https://twitter.com/MayadeenEnglish/status/1570361082484604928

రష్యా - యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం జరిగింది.

తైవాన్ విషయంలో చైనా అమెరికాల మధ్య సంబంధాలు బాగా దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా యూఎస్ పార్లమెంట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి.

మరో వైపు, ఇరాన్ అమెరికాల మధ్య చోటు చేసుకోవాల్సిన అణ్వస్త్ర ఒప్పందం విషయంలో ఎటువంటి పురోగతి లేదు.

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) నాయకులు

సమర్‌కండ్ సమావేశానికి సరిగ్గా ఒక నెల రోజుల ముందు ఆగస్టు 19న, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల భద్రతా మండలి కార్యదర్శుల సమావేశం తాష్కెంట్‌లో జరిగింది.

ఈ సమావేశంలో మాట్లాడుతూ, "ఎస్‌సీఓ అమెరికా మిత్ర దేశాల కూటమికి వ్యతిరేక కూటమిగా తయారవ్వాలి’’ అని రష్యా భద్రతా మండలి కార్యదర్శి నికొలాయి పెట్రోషేవ్ అన్నారు.

ఆయన ప్రసంగంలో పదే పదే ప్రపంచ దేశాల మధ్య పోరాటం గురించి ప్రస్తావించారు. ఆయన ఉద్దేశ్యంలో ఈ పోరాటంలో రష్యాతో పాటు ఎస్‌సీఓ సభ్యదేశాలన్నీ ఒకే వైపు ఉన్నాయి.

కానీ, ఈ ఒక్క అంశం ఆధారంగా ఎస్‌‌సీఓ ను యూఎస్ వ్యతిరేక కూటమిగా చెప్పగలమా?

అలా భావించలేమని మాజీ భారతీయ రాయబారి పినాక్ రంజన్ చక్రవర్తి అంటున్నారు.

"ఇది పశ్చిమ దేశాలు అవలంబించే వైఖరి. వాళ్లకు నచ్చింది వాళ్ళు చేస్తారు, నాటో లాంటి సంస్థలను ఏర్పాటు చేసుకుంటారు. కానీ, ఇతరులు అదే మాదిరి పనిని చేస్తే దానిని పశ్చిమ దేశాలకు వ్యతిరేక వైఖరి అని ప్రకటిస్తారు. ఇదంతా వారి పాత ఆలోచనా ధోరణికి సంకేతం. ఈ ధోరణికి ముగింపు పలకాలి. ప్రపంచం మారుతోంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అమెరికా వ్యతిరేక కూటమి కాదు. ఇందులో రష్యా, చైనా సభ్యులుగా ఉన్నాయి. కానీ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రూపొందుతున్న సమయంలో యుక్రెయిన్‌తో యుద్ధం జరగడం లేదనే విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి" అని అన్నారు.

ఇరాన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో చేరడం పట్ల స్పందిస్తూ, "ఇరాన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో ఎందుకు చేరకూడదు? అమెరికా, బ్రిటన్ ఇరాన్ పై ఆంక్షలు విధించాయి, కానీ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాలేవీ ఇరాన్ పై ఆంక్షలు విధించలేదు" అని అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎటువంటి వైఖరిని అవలంభిస్తుంది? ఇందులో అయోమయానికి తావుందా? "భారత్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో సభ్యురాలిగానే కొనసాగుతుంది. పశ్చిమ దేశాల కూటమిలో కూడా ఉంటుంది. భారత్ తన సొంత ప్రయోజనాల కోసం పని చేస్తుంది. భారత్ ఏది ప్రయోజనమో, పశ్చిమ దేశాలు చెప్పాల్సిన అవసరం లేదు" అని అన్నారు.

"అమెరికా ఈ అంశాన్ని ప్రజాస్వామ్యం నియంతృత్వం మధ్య జరుగుతున్న వివాదంలా చూపించి భారత్ దృష్టిని మళ్లించాలని చూస్తోంది" అని పినాక్ అన్నారు.

అయితే, భారత్ మాత్రం ఈ అంశాన్ని అమెరికా కళ్లతో చూడటం లేదని అన్నారు. "అమెరికా ఈ వైఖరితో మరో ప్రచ్ఛన్న యుద్ధానికి తెర తీయాలని చూస్తోంది. భారత్ మాత్రం బహుళ ధ్రువ ప్రపంచాన్ని కోరుకుంటోంది" అని అన్నారు. "భారత్ అన్ని దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తుంది" అని అన్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌, భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

అయితే, ఈ వైఖరిని అవలంబించడం భారత్‌కు అంత సులువైన విషయమా? భారత్ ముందున్న అతి పెద్ద సవాలేంటి?

"షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉన్నా లేకపోయినా కూడా ఇది భారత్‌కు సవాలుతో కూడిన అంశమే. యుక్రెయిన్ ఇందుకు పెద్ద ఉదాహరణ" అని లండన్ కింగ్స్ కాలేజీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ హర్ష్ పంథ్ అన్నారు.

"షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూటమిలో చైనా, రష్యా అమెరికా వ్యతిరేక దేశాలుగా ఉండాలనే అనుకుంటాయి. కానీ, భారత్‌తో పాటు సభ్య దేశాలుగా ఉన్న మధ్య ఆసియా దేశాలు ఈ ధోరణిని సమర్ధించకపోవడంతో ఇదంత సులభం కాదు" అని అన్నారు.

"రష్యా, చైనా వైఖరి అమెరికా వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తాయి. కానీ, ఎస్‌సీఓ అధికారిక ప్రకటనల్లో అమెరికా వ్యతిరేక ధోరణి కనిపించదు" అని అన్నారు.

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, రష్యా అధ్యక్షుడు పుతిన్

భారత్‌కు క్లిష్ట పరిస్థితి

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పశ్చిమ దేశాలకు వ్యతిరేక కూటమిగా రూపొందిందనే అభిప్రాయం పశ్చిమ దేశాల్లో ఉంది కానీ, అది నిజం కాదని పలు దేశాలకు రాయబారిగా వ్యవహరించిన అనిల్ త్రిగుణాయత్ అన్నారు.

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ సంస్థ. రష్యా చైనాకు దగ్గరకావడానికి అమెరికాయే కారణం అని ఆయన అన్నారు.

"షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో రష్యాతో పాటు చైనా, ఇరాన్ లాంటి చాలా దేశాలున్నాయి. ఈ దేశాల మధ్య కూడా అంతర్గతంగా చాలా విభేదాలున్నాయి. భారత్ చైనా ల మధ్య సంబంధాలు కూడా మెరుగ్గా లేవు. భారత్‌‌కు పాకిస్తాన్ తో సంబంధాలు కూడా దారుణంగా ఉన్నాయి. తుర్కియే తో కూడా సంబంధాలు క్షీణిస్తున్నాయి. షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్‌‌లో భారత్ ఉన్నంతవరకు దానిని అమెరికా వ్యతిరేక కూటమి అని చెప్పలేం" అని అన్నారు.

వచ్చే ఏడాది భారత్ ఎస్‌సీఓ సమావేశానికి ఆతిధ్యం ఇవ్వనుంది. దీంతో పాటు జీ-20 సమావేశాలను కూడా నిర్వహించనుంది.

భారత్ అన్ని దేశాల నాయకులకు ఆతిధ్యం ఇస్తుందని, మనం ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని త్రిగుణాయత్ అభిప్రాయపడ్డారు.

రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న దాడి విషయంలో భారత్ వహించిన దౌత్యపరమైన వైఖరి స్పష్టంగా కనిపించింది. భారత్ చెప్పే విషయాన్ని ఇతర దేశాలు తీవ్రంగానే పరిగణిస్తాయి.

https://twitter.com/narendramodi/status/1570690289622458370

కానీ, వాషింగ్టన్‌లోని హడ్‌సన్ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్ ఫెలో అపర్ణ పాండే మాత్రం మరొక అభిప్రాయాన్ని వినిపించారు.

క్వాడ్ రూపొందినప్పుడు, చైనా దానిని ఆసియా దేశాల నాటో అని పిలిచేది.

"చైనా రష్యా ఊహించినట్లుగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పురోగతి సాధించలేదు. ఎస్‌సీఓ ఎప్పటికీ నాటో మాదిరిగా మారలేదు. ఈ సంస్థ నిధులను కూడా ఇవ్వదు. ప్రపంచం భయపడే ఒప్పందాలను కూడా వేటినీ చేసుకోలేదు. చైనా, రష్యా మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయనడం వాస్తవమే" అని అన్నారు.

కానీ, ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ముందున్న సవాళ్లేంటని ప్రశ్నించినప్పుడు, "స్వతంత్ర దౌత్య విధానాన్ని అవలంబించడమే భారత్‌ ముందున్న అతి పెద్ద సవాలు అన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో భారత్ పరిస్థితి సులభంగానే ఉండేది. అమెరికా, రష్యాలిద్దరికీ భారత్ భూభాగం అవసరం లేదు. కానీ, భారత్ పొరుగు దేశాలకు చైనా నిధులు, ఆయుధాలు సమకూరుస్తోంది. ఈ దేశాలన్నీ తన తరఫున ఉండాలని కోరుకుంటోంది.

"ప్రస్తుత రష్యా, సోవియెట్ యూనియన్ అంత బలోపేతమైనది కాదు. నేటి రష్యాకు చైనాను ఎదుర్కొనే పరిస్థితి లేదు" అని అన్నారు.

"భారత్ 60-70% ఆయుధాలను రష్యా నుంచి సమకూర్చుకుంటుంది. దీంతో, భారత్ రష్యా ఆగ్రహాన్ని చవిచూడలేదు. కానీ, రష్యా, చైనా మిత్ర దేశాలు కావడం మాత్రం భారత్ కు సమస్య" అని అన్నారు.

భారత్‌కు ఉత్తమమైన మార్గం ఏంటి? అని అడిగినప్పుడు "ప్రస్తుతం భారత్ దగ్గర చైనాకు వ్యతిరేకంగా నిలబడే ఆర్ధిక, సైనిక బలం లేవు. ప్రస్తుతానికి భారత్ దగ్గర మరో మార్గం లేదు. భారతదేశం క్రమంగా స్వయం సమృద్ధి సాధించడం అవసరం" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
SCO: Is the Shanghai Cooperation Organization turning into an anti-US alliance, what are the problems for India?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X