ఎస్‌సీవో సదస్సు-తజికిస్తాన్ పర్యటనకు విదేశాంగ మంత్రి జైశంకర్-చైనా విదేశాంగ మంత్రితో భేటీకి ఛాన్స్
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మంగళవారం(జులై 13) తజికిస్తాన్ పర్యటనకు వెళ్లనున్నారు. తజికిస్తాన్‌లోని దుషాంబేలో షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) ఆధ్వర్యంలో జరగనున్న సదస్సులో ఆయన పాల్గొననున్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ,చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిలతో పాటు ఎస్‌సీవో సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా,నాటో దళాల ఉపసంహరణ తర్వాత తాలిబన్ల విధ్వంసం రోజురోజుకు పెచ్చుమీరుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ఈ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు,తాలిబన్ల అరాచకాలపై సదస్సులో చర్చించనున్నారు. ఆఫ్ఘన్ పొరుగునే ఉన్న దక్షిణ,మధ్య ఆసియాలపై తాలిబన్ల ప్రభావంపై కూడా చర్చించనున్నారు.

లొంగిపోయిన ఆఫ్ఘన్ ఆర్మీ కమెండోలను తాలిబన్లు హతమారుస్తున్న ఘటనలు చూస్తుంటే.. గడిచిన రెండు దశాబ్దాల్లో వారిలో ఎటువంటి మార్పు రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా సమావేశంలో తాలిబన్ల కట్టడిపై ఫోకస్ చేసే అవకాశం ఉంది.
ఇక ఈ సదస్సులో చైనాతో పాటు పలు దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ద్వైపాక్షిక సమావేశం ఉండవచ్చునని చెబుతున్నారు. అదే జరిగితే చైనా విదేశాంగ మంత్రితో తూర్పు లదాఖ్‌లో పరిస్థితులపై జైశంకర్ చర్చించే అవకాశం ఉంది. సైన్యం ఉపసంహరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసే చర్యలపై చైనా విదేశాంగ మంత్రితో చర్చించవచ్చు. అయితే ద్వైపాక్షిక సమావేశాలకు సంబంధించి ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
రెండు రోజుల క్రితమే ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయం నుంచి మన అధికారులను వెనక్కి రప్పించిన సంగతి తెలిసిందే. తాలిబన్లు కాందహార్ పట్టణానికి చేరువగా రావడంతో అధికారులను వెనక్కి రప్పించాల్సి వచ్చింది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌లోని చాలా గ్రామాలు,పట్టణాలను తాలిబన్లు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. గతేడాది జరిగిన తాలిబన్లతో జరిగిన శాంతి ఒప్పందం మేరకు అమెరికా,నాటో దళాలు అక్కడి నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత తాలిబన్లు మరింత రెచ్చిపోతున్నారు. శాంతి ఒప్పందాన్ని తుంగలో తొక్కి అరాచకం సృష్టిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఇంత విధ్వంసాన్ని,అరాచకాన్ని చవిచూస్తున్న వేళ అమెరికా దళాలను ఉపసంహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Recommended Video
కాగా,షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) 2001లో ఏర్పడింది. ఇందులో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. అలాగే భారత్, అఫ్ఘనిస్థాన్, ఇరాన్, మంగోలియా, పాకిస్థాన్ పరిశీలక దేశాలుగా వ్యవహరిస్తున్నాయి. శాంతి భద్రతలు,సుస్థిరత లక్ష్యంగా ఎస్‌సీవో పనిచేస్తోంది.












Click it and Unblock the Notifications