సరిహద్దుల్లో ఆ 11 గంటలు..రాత్రి దాకా: మొండికేస్తోన్న చైనా: కాస్సేపట్లో లఢక్‌కు ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని నివారించడానికి చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. రెండు దేశాల సైన్యాధికారుల మధ్య సుమారు 11 గంటల పాటు కొనసాగిన సుదీర్ఘ చర్చల్లో ఎలాంటి ఫలితమూ రాలేదు. చర్చల సందర్భంగా చైనా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతోందని, ఏ మాత్రం అంగీకరించలేని ప్రతిపాదనలను భారత్ ముందు ఉంచుతోందని తెలుస్తోంది.

రెండో దఫాలోనూ..
లఢక్ సెక్టార్ సమీపంలో గాల్వన్ వ్యాలీలో కిందటి వారం భారత్-చైనా సైనికుల మధ్య ప్రాణాంతక ఘర్షణల అనంతరం రెండు దేశా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఒకరికి ఒకరు తీసిపోనట్టుగా రెండు దేశాల తరఫున వాస్తవాధీన రేఖ వెంబడి భారీ ఎత్తున సైనిక బలగాలు మోహరించాయి. యుద్ధ సామాగ్రిని తరలించాయి. ఈ ఉద్రిక్తతలను నివారించడానికి రెండు దేశాల లెప్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు సమావేశం అయ్యారు. ఈ రెండే దేశాల మధ్య చర్చలు చోటు చేసుకోవడం ఇది రెండోసారి. ఛుసుల్-మోల్డోలోని బోర్డర్ ఆఫీసర్స్ మీటింగ్ పాయింట్‌లో ఈ చర్చలు కొనసాగించారు.

11 గంటల మారథాన్ చర్చ
సోమవారం ఉదయం 11: 30 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు రాత్రి 10:30 గంటల దాకా కొనసాగాయి. అయినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదని సమాచారం. ఈ చర్చల సందర్భంగా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లెప్టినెంట్ జనరల్.. భారత్ ముందు కొన్ని కీలక ప్రతిపాదనలను ఉంచిందని, అవి ఎంతమాత్రమూ ఆమోదించదగ్గవి కాదని అంటున్నారు. డొంక తిరుగుడు మాటలతో కాలయాపనకు ప్రాధాన్యత ఇచ్చిందని తెలుస్తోంది.

భారత్ డిమాండ్ ఒక్కటే..
ఈ చర్చల సందర్భంగా భారత్ చేసిన డిమాండ్ ఒక్కటే.. వాస్తవాధీన రేఖ వద్ద ఏప్రిల్‌కు ముందు నాటి పరిస్థితులను పునరుద్దరించడం. ఈ ఒక్క డిమాండ్‌కే భారత్ కట్టుబడి ఉందని, దీన్నే పదేపదే చైనా ముందు ప్రస్తావించిందని చెబుతున్నారు. భారత భూభాగం పరిధిలోకి వచ్చి ఫోర్ ఫింగర్స్ పాయింట్, పంగ్యాంగ్ త్సొ, గోఘ్రా ఫోస్ట్ హాట్ స్ప్రింగ్స్ వంటి రక్షణాత్మ, వ్యూహాత్మక ప్రదేశాలను ఖాళీ చేయాలని ఆర్మీ లెప్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ ప్రతిపాదించారు.

మరిన్ని ప్రాంతాలను ఖాళీ..
ఫోర్ ఫింగర్స్ ఏరియా ప్రాంతంలో చైనా ఇప్పటికే బంకర్, ఫిల్‌బాక్స్, అబ్జెక్షన్ పోస్ట్‌ను నిర్మించింది. వాటిని తొలగించాలని హరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. గోఘ్రా పోస్ట్ హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతం, గాల్వన్ వ్యాలీలో మోహరింపజేసిన సైన్యాన్ని ఉపసంహరించుకోవడం వంటి ప్రతిపాదనలను భారత్ ప్రస్తావించగా.. చైనా అంగీకరించలేదని సమాచారం. మంగళవారం కూడా చర్చలను కొనసాగించాలని రెండు దేశాల సైనికాధికారులు ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు.
Recommended Video

లేహ్‌కు ఆర్మీ చీఫ్
ఇలాంటి కీలక, ఉద్రిక్త పరిణామాల మధ్య భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె లఢక్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో బయలుదేరి లేహ్ చేరుకుంటారు. సాయంత్రం వరకూ అక్కడే ఉంటారని తెలుస్తోంది. భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలు, ఉద్రిక్తతలు తలెత్తిన తరువాత ఆర్మీ చీఫ్ లఢక్ సెక్టార్‌ను సందర్శించడానికి వెళ్లడం ఇదే తొలిసారి. లేహ్ బేస్ క్యాంపు నుంచి ఆయన పరిస్థితులు సమీక్షిస్తారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications